
- గందరగోళం మధ్య నిలిచిన ఖానాపూర్ ఎన్నిక
ఇబ్రహీంపట్నం/కోల్‌బెల్ట్/ఖానాపూర్, వెలుగు: ఎక్కడా పూర్తి మెజార్టీ లేకపోవడంతో సీపీఐ, బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ రెండు మున్సిపాలిటీలను దక్కించుకున్నది. సీపీఐ సపోర్ట్‌తో క్యాతనపల్లి, బీజేపీ పొత్తుతో ఇబ్రహీంపట్నంలో కొలువుదీరింది. ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నిక సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో ఆదివారానికి వాయిదా వేశారు. గతంలో ఆగిపోయిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీల ఎన్నికలను శనివారం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా.. బీఆర్‌ఎస్ 13, కాంగ్రెస్-8, బీజేపీ -2 వార్డులు గెలువగా.. ఓ వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఆందోళనలు, కోర్టు ఉత్తర్వులు కారణంగా గతంలో ఎన్నిక వాయిదా పడింది.
బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఆకుల యాదగిరి, బీజేపీ నుంచి సిద్దం భానుప్రియ కాంగ్రెస్‌లో చేరారు. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిసి కాంగ్రెస్ బలం 11కు చేరింది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ దాసరి మురళీకృష్ణ, బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామలతో కలిసి బీఆర్‌ఎస్ బలం 14కు చేరుకుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక సమావేశం ప్రారంభం కాగా, 24 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్‌అఫీషియో మెంబర్ హాజరయ్యారు. ప్రక్రియ ప్రారంభం కాగానే ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి కాంగ్రెస్ సభ్యులు బయటకు వచ్చారు.
అనంతరం బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఏడో వార్డు కౌన్సిలర్ టేకుల సుదర్శన్‌రెడ్డిని చైర్మన్‌గా, బీజేపీ తరఫున ఒకటో వార్డు నుంచి గెలిచిన ముత్యాల శ్యామలను వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. గెలిచిన వారికి మాజీమంత్రి ఇంద్రారెడ్డి, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య సమక్షంలో క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీస్‌లో ఎన్నిక నిర్వహించారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన డాక్టర్సంధ్యారాణి ఎన్నికయ్యారు. వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐకి చెందిన మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు. కాంగ్రెస్కౌన్సిలర్లు ఎన్నిక ప్రక్రియకు హాజరుకాలేదు.
ఖానాపూర్ ఎన్నిక మళ్లీ వాయిదా..
ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. శనివారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకు సమావేశం ఏర్పాటు చేయగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. చైర్‌పర్సన్ పదవి కోసం కాంగ్రెస్ నుంచి చిన్నం సత్యనారాయణ, బీజేపీ నుంచి అంకం మౌనిక నామినేషన్ వేశారు. మౌనికకు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ క్యాండిడేట్ చిన్నం సత్యనారాయణకు ఎక్స్‌అఫీషియో సభ్యుడు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌తో పాటు పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్, బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ కౌన్సిలర్ మద్దతు పలికారు.
బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్ కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్టు చేతులెత్తడం వివాదాస్పదంగా మారింది. సదరు కౌన్సిలర్ మొదట తమకే మద్దతు ఇచ్చారని బీజేపీ కౌన్సిలర్లు.. లేదు ఆ కౌన్సిలర్ మద్దతు తమకే అంటూ ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో మున్సిపల్ ఆఫీస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయి దాటే అవకాశం ఏర్పడడంతో ఆఫీసర్లు ఎన్నికను వాయిదా వేశారు.