Reading Time: < 1 minute
జస్ట్ 2 గంటలే!.. హైదరాబాద్‌ టూ వైజాగ్ రూట్‌లో కొత్త హైవే.. ఇక ప్రయాణం మరింత సులభం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా ముఖచిత్రం మారనుండి. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని మరింత సులబతరం చేసే ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రయాణికుల సౌకర్యార్థం జాతీయ రహదారి అధికారులు వైరాలోని మధిర మార్గం, వీఎం బంజర్‌ రింగ్‌సెంటర్ వద్ద స్పష్టమైన సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. దీనివల్ల వాహనదారులు దారి విషయంలో గందరగోళానికి గురికాకుండా సులభంగా ప్రయాణించవచ్చు. అయితే ఈ రహదారిపై మొదటి 15 రోజుల పాటు ఎటువంటి టోల్ ఫీజు లేకుండానే వాహనాదారులు ప్రయాణించవచ్చని.. గడువు ముగిసిన తర్వాత నిబంధనల మేరకు రుసుము వసూలు చేస్తామని అధికారులు తెలిపారు.

ఈ నూతన మార్గం వల్ల హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వారికి దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా, కనీసం రెండు గంటల సమయం ఆదా అవుతుంది. అయితే ప్రస్తుతం 4 లేన్‌లుగా ఉన్న ఈ రహదారిని భవిష్యత్తులో 6 లైన్ల విస్తరణకు వీలుగా రూపొందించారు. భద్రత కోసం ప్రతి 18 కి.మీలకు ఒక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్‌ను, ప్రతి 5 కి.మీలకు అత్యవసర ఓపెనింగ్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల భద్రత కోసం ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలను కూడా హైవేపై అమర్చారు. మార్గమధ్యలో 10 ప్రధాన వంతెనలు, 295 కల్వర్టులు, 98 అండర్ పాస్‌లును ఏర్పాటు చేశారు.

ఈ హైవే కేవలం రవాణాకే పరిమితం కాకుండా ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఇంజిన్‌లా మారనుంది. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద ఎగ్జిట్ పాయింట్ ఉండటంతో స్థానిక రైతులకు, వ్యాపారులకు మేలు చేకూరనుంది. హైవే పొడవునా కోల్డ్ స్టోరేజీలు, లాజిస్టిక్ హబ్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.