Reading Time: < 1 minute

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను గాయం కారణంగా ఈ సీజన్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. త్వరలోనే జట్టులోకి తిరిగి వస్తాడనుకున్న కమిన్స్ ఎంట్రీ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఇప్పటికే అతను లేకపోవడంతో హైదరాబాద్ బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కమిన్స్ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు.

కమిన్స్, గాయం కారణంగా.. యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్టు నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. గాయం ఉన్నప్పటికీ, ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు కమిన్స్, హైదరాబాద్ శిబిరంలో చేరి నెట్స్‌లో చురుకుగా బౌలింగ్ చేశాడు. అయితే, అతను తిరిగి మైదానంలోకి దిగేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంకా అనుమతి ఇవ్వలేదు.

దీంతో తుది అనుమతి కోసం కమిన్స్ ఇప్పుడు తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. సీఏ పర్యవేక్షణలో త్వరలో స్కానింగ్ జరగనుందని.. ఈక్రమంలో ఏప్రిల్ 17 నాటికి హైదరాబాద్ జట్టులో తిరిగి చేరనున్నట్లు సమాచారం. దీంతో కమిన్స్ మరో మూడు మ్యాచ్‌లకు దూరమవ్వనున్నాడు. అదీ కూడా అతని స్కానింగ్‌ రిజల్ట్ పై ఆధార పడి ఉంది.

కాగా.. ఎస్ఆర్‌హెచ్ తన తర్వాతి మూడో మ్యాచ్ లో లక్నోతో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోర పరాజయం పాలైన హైదరాబాద్, రెండో మ్యాచ్‌లో పుంజుకుని కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.