Reading Time: 2 minutes
SRH vs LSG IPL 2026 : సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో ఫైట్.. ప్యాట్ కమిన్స్ దూరం.. రిషబ్ పంత్ ఓపెనింగ్ కష్టాలు తీరేనా?

SRH vs LSG IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం భాగ్యనగరంలో అసలైన పరుగుల యుద్ధం మొదలవబోతోంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడనున్నాయి. ఈ మైదానం బ్యాటర్లకు స్వర్గధామం అని అందరికీ తెలిసిందే. గత కొన్ని సీజన్లలో ఇక్కడ 220 పరుగులు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. బౌలర్లకు నరకం చూపించే ఈ పిచ్‌పై మరో హై స్కోరింగ్ థ్రిల్లర్ ఖాయమనిపిస్తోంది.

ఉప్పల్ స్టేడియం అంటేనే బ్యాటర్ల అడ్డా. గత ఏడాది పంజాబ్ కింగ్స్ చేసిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా ఎస్‌ఆర్‌హెచ్ ఈజీగా ఛేజ్ చేసిందంటే ఇక్కడ పిచ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గత మూడు సీజన్లలో ఇక్కడ సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 194 పరుగులుగా ఉంది. ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే 3 గంటల సమయంలో వర్షం పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవేళ వర్షం పడకపోతే మాత్రం సిక్సర్ల వర్షం కురవడం ఖాయం.

సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన వీపు గాయానికి సంబంధించి స్కానింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లినట్లు సమాచారం. అతను ఏప్రిల్ 17 వరకు జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ జట్టును నడిపించే అవకాశం ఉంది. ఆర్‌సీబీ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఎస్‌ఆర్‌హెచ్, కోల్‌కతాపై 65 పరుగుల తేడాతో గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హార్డ్ హిట్టర్లతో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్, ఈషన్ మలింగ కీలకం కానున్నారు.

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 141 పరుగులకే కుప్పకూలడం ఆ జట్టు బలహీనతను బయటపెట్టింది. ముఖ్యంగా రిషబ్ పంత్ ఓపెనర్‌గా రావడం ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. మార్క్రామ్, మిచెల్ మార్ష్‌లను ఓపెనర్లుగా పంపి, పంత్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నికోలస్ పూరన్ వంటి విధ్వంసకర బ్యాటర్ ఉన్నా, సరైన పొజిషన్‌లో బ్యాటింగ్ రాకపోవడం లక్నోకు మైనస్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని లక్నో పట్టుదలతో ఉంది.

హెడ్-టు-హెడ్ రికార్డులు

గణాంకాలను పరిశీలిస్తే ఎస్‌ఆర్‌హెచ్‌పై లక్నోదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచుల్లో లక్నో నాలుగు గెలిచింది. ఉప్పల్ స్టేడియంలోనూ మూడు మ్యాచుల్లో రెండింటిని లక్నోనే దక్కించుకుంది. అయితే చివరిసారిగా తలపడినప్పుడు సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మయాంక్ యాదవ్ ఫిట్‌గా ఉన్నా ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. షమీ, మోహ్సిన్ ఖాన్ వంటి పేసర్లతో లక్నో బౌలింగ్ యూనిట్ సన్‌రైజర్స్ బ్యాటర్లను ఎలా అడ్డుకుంటుందో చూడాలి.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..