
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై 9 మ్యాచ్‌లు గడిచాయి. ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోయినా, హై-స్కోరింగ్ మ్యాచ్‌లతో అభిమానులకు అసలైన వినోదం లభిస్తోంది. ముఖ్యంగా ఈసారి సీనియర్ల కంటే యువ ఆటగాళ్లే మైదానంలో విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కుర్రాడు సమీర్ రిజ్వీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు బాదిన రిజ్వీ, మొత్తం 160 పరుగులతో అదరగొడుతున్నాడు. ఇతని జోరు చూస్తుంటే ఈసారి ఆరెంజ్ క్యాప్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు ముంబై ఇండియన్స్ వెటరన్ స్టార్ రోహిత్ శర్మ మళ్ళీ పాత ఫామ్ అందుకున్నాడు. ఇప్పటికే ఒక హాఫ్ సెంచరీతో 113 పరుగులు చేసిన రోహిత్, తన కెరీర్‌లో తొలిసారి ఆరెంజ్ క్యాప్ అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ 21 ఏళ్ల బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ (103 పరుగులు), పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా ప్లేయర్ కూపర్ కానోలీ (108 పరుగులు) కూడా టాప్-5 రేసులో ఉండటం విశేషం. వీరితో పాటు ఇషాన్ కిషన్, ఆయుష్ మ్హాత్రే, సాయి సుదర్శన్ వంటి యంగ్ బ్లడ్ కూడా పరుగుల వేటలో పోటీ పడుతున్నారు.
బౌలింగ్ విభాగంలోనూ పోటీ తీవ్రంగా ఉంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన రవి బిష్ణోయ్ 5 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో నంబర్ వన్ గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ విజయ్‌కుమార్ వైశాక్ తన వేరియేషన్లతో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ 5 వికెట్లు తీసి బిష్ణోయ్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు. గత సీజన్ పర్పుల్ క్యాప్ విజేత ప్రసిద్ధ్ కృష్ణ ఈసారి కూడా 4 వికెట్లతో అదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. జైదేవ్ ఉనద్కత్ కూడా ఈసారి మెరుగైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు.
ప్రస్తుత గణాంకాల ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ టి.నటరాజన్, లుంగీ ఎన్‌గిడి కూడా రేసులో వెనుకంజలో లేరు. అయితే సీజన్ ఇప్పుడే మొదలైనందున ఈ టోర్నీ ముగిసేలోపు ఎవరు విజేతలుగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లను బట్టి చూస్తే, బ్యాటర్ల హవా ఎక్కువగా ఉన్నప్పటికీ, డెత్ ఓవర్లలో బౌలర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా పవర్ ప్లే లో యువ ఆటగాళ్లు చూపుతున్న తెగువ చూస్తుంటే, ఈసారి ఐపీఎల్ అంచనాలకు అందకుండా సాగేలా ఉంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..