Reading Time: < 1 minute

తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్ పై దాడి జరిగింది. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేరళకు వచ్చారు. ఈ క్రమంలో నిన్న రాత్రి మలప్పురం జిల్లాలో శశి థరూర్ కాన్వాయ్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. ఏపీ అనిల్ కుమార్ తరపున ప్రచారం చేసేందుకు థరూర్ వాండూర్ వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు థరూర్ కాన్వాయ్‌ను వెంబడించి, ఆయన కారుపై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుండగులు, థరూర్ ను దూషిస్తూ, ఆయనపై దాడికి యత్నిస్తుండగా… గన్‌మెన్ అడ్డుపడ్డారు. దీంతో గన్‌మెన్‌ను కూడా అసభ్య పదజాలంతో దూషించి, ఆ తర్వాత అతనిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై గన్‌మెన్ వాండూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాండూర్ పరిధిలోని ‘చెల్లితోడ్’ వద్ద రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిస్తోంది.

శశి థరూర్ కారును అడ్డుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన యువకుడిని కలికావుకు చెందిన ‘ఉమర్’గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థరూర్ వాహనాన్ని అడ్డుకున్న దుండగులు ప్రయాణించిన రెండు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ దాడి వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? అనే కోణంలో విచారిస్తున్నారు. దాడికి పాల్పడిన దుండగులు కావాలనే గొడవ సృష్టించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.