
ప్రియురాలు తన నెంబర్ బ్లాక్ చేయడంతో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. తన ప్రేయసితో మాట్లాడించాలని 11kv హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హంగామా చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం రేపింది. మూడు గంటల పాటు హల్ చల్ సృష్టించిన ఆ యువకుడికి పోలీసులు నచ్చజెప్పి కిందకు దింపి కేసు నమోదు చేశారు. ఈ విచిత్ర సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలలో ధర్మరావుపేట లో జరిగింది. ధర్మారావుపేట గ్రామానికి చెందిన సూర రాజు అనే యువకుడు మోరంచ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ మిషన్ టవర్ ఎక్కాడు. తాను మనసు పడిన యువతి తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసిందని హంగామా చేశాడు.
తన ప్రేయసితో వెంటనే మాట్లాడించాలని, లేనిపక్షంలో కిందకు దిగేది ప్రసక్తేలేదని భీష్మించుకు కూర్చున్నాడు. 11,000 వోల్టుల విద్యుత్ ప్రవహించే ఆ టవర్ మీద యువకుడిని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని అందరూ వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుమారు మూడు గంటలపాటు రాజుకు నచ్చచెప్పారు.‘‘నువ్వు కిందకు రా.. నీ ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి నీ బాధ ఆమెకు వివరిస్తాం, మీ ఇద్దరినీ మాట్లాడిస్తాం” అంటూ పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసుల మాటలను నమ్మిన రాజు ఎట్టకేలకు శాంతించి క్షేమంగా కిందకు దిగాడు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
చివరికి ఏమైంది?
క్షేమంగా కిందకు దిగిన రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించడం, ఆత్మహత్యాయత్నం వంటి చర్యల కింద అతనిపై కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల తన ప్రాణమే కాకుండా, తనను నమ్ముకున్న తల్లిదండ్రుల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని పోలీసులు యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు.