
తమిళనాడులో కార్యకలాపాలు ప్రారంభించిన వియత్నాం ఆధారిత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే విన్‌ఫాస్ట్ VF6, విన్‌ఫాస్ట్ VF7 ఎలక్ట్రిక్ SUVలతో వార్తల్లో నిలిచిన ఈ సంస్థ, ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇవో, ఫెలిజ్, వైపర్ పేర్లతో రాబోయే ఈ స్కూటర్లు దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో గట్టి పోటీని సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ తమిళనాడులోని తూత్తుకుడిలో తన అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఈ వాహనాల విడిభాగాలను ప్రధానంగా వియత్నాం నుంచి దిగుమతి చేసుకుని, భారత్‌లో అసెంబుల్ చేయనుంది. మార్కెట్ డిమాండ్ పెరిగే కొద్దీ తూత్తుకుడిలో ఉత్పత్తి విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
సాంకేతిక వివరాల పరంగా చూస్తే ఈ మూడు స్కూటర్లు కూడా లిథియం అయాన్ బ్యాటరీలతో వస్తాయి. ఇవో మోడల్‌లో 2.4 కిలోవాట్-గంటల సామర్థ్యం గల రెండు బ్యాటరీలు, 2.25 కిలోవాట్ల హబ్ మోటార్ ఉండి, గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఫెలిజ్ మోడల్‌లో 3 kWh బ్యాటరీ, 2.8 kW మోటార్ ఉండగా, వైపర్ మోడల్‌లో 4.8 kWh బ్యాటరీతో పాటు 3 kW మోటార్ అమర్చబడి ఉంటుంది. పనితీరు, శక్తి పరంగా ఈ మూడు మోడళ్లు వేర్వేరు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేయబడ్డాయి.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, కొత్త కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించడం పోటీని మరింత పెంచుతోంది. ఇప్పటికే దేశీయంగా అనేక సంస్థలు ఈ విభాగంలో స్థిరపడగా, విన్‌ఫాస్ట్ ఎంట్రీతో మార్కెట్‌లో ధరలు, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా మరింత పోటీ పెరిగే అవకాశముంది. మొత్తంగా భారత మార్కెట్‌కు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లతో విన్‌ఫాస్ట్ తన స్థానం బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. EV రంగంలో విస్తరణకు ఇది మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి