Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌ను అంతం చేయడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.  ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో దీదీ మాట్లాడుతూ.. అధికారులను బెదిరిస్తున్నారని, ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నారని అన్నారు. “మీకు దమ్ముంటే, బహిరంగంగా పోరాడండి” అని ఫైరయ్యారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించే ప్రయత్నాలు ప్రజలను భయపెట్టడానికేనని ఆమె మండిపడ్డారు.

టిఎంసి పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడతామని సిఎం మమత హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను నెమ్మదింపజేయడానికి సుమారు 500 మంది అధికారులను తొలగించారని ఆరోపించారు. “మీరు నెల రోజుల పాటు పనులను ఆపవచ్చు, కానీ ఎన్నికల తర్వాత అన్నీ తిరిగి ప్రారంభమవుతాయి” అని అన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అన్ని మతాల ప్రజల కోసం పనిచేస్తుందని, విభజన రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోతే బెంగాలీ భాష, గుర్తింపు ప్రమాదంలో పడతాయని బెనర్జీ హెచ్చరించారు.

పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదటి దశలో పురూలియా, బంకురా, ఝార్‌గ్రామ్, బీర్‌భూమ్, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్, జల్‌పైగురి, మాల్దాహా, ముర్షిదాబాద్, ఉత్తర, దక్షిణ దినాజ్‌పూర్, పశ్చిమ బర్ధమాన్, డార్జిలింగ్, కూచ్‌బెహార్, అలీపుర్‌దువార్, కాలింపాంగ్‌లలో ఎన్నికలు జరుగుతాయి.

రెండవ దశలో తూర్పు బర్ధమాన్, నాడియా, ఉత్తర మరియు దక్షిణ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, కోల్‌కతాలో ఎన్నికలు జరుగుతాయి.