
మన తెలంగాణ/హైదరాబాద్: ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.. కాబట్టి ఎదుర్కొని విజయం సాధించేందుకు ప్రతి నాయకుడు, ప్రతి కా ర్యకర్త సిద్ధంగా ఉండాలి’ అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ – గో ల్కొండ జిల్లా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం పార్టీ రాష్ట్ర కా ర్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఉమా మహేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాబోయే జిహెచ్‌ఎంసి ఎన్నికల కోసం పార్టీ శ్రేణుల ను అప్రమత్తం చేశారు. తన ప్రసంగంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో లేదా వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉందన్నారు. దీనికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. బూత్ కమిటీలను బలోపేతం చేసుకోవాలని, అన్ని బూత్ కమిటీల నియామకాన్ని తక్షణమే పూర్తి చేయాలని చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ, ‘స్పెషల్ సమ్మరీ రివిజన్‘ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి డివిజన్ ప్రెసిడెంట్ మరియు సీనియర్ నాయకులు తమ డివిజన్‌లో కొత్త ఓట్లను నమోదు చేయించాలని ఆయన సూచించారు. ఇంకా బూత్ స్థాయి కార్యకర్తలందరికీ రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు ప్రజలనూ కలుపుకుని వెళ్లేందుకు త్వరలో పార్టీ పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈ నెల 5 (ఆదివారం) బాబూ జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.
ఈ నెల 6న బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని, 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని ప్రజలతో కలిసి నిర్వహించుకోవాలని ఆయన చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్, జోనల్ కమిషనర్, జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తన కార్యాలయం నుండి అధికారిక లేఖలు తీసుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో గోల్కండ జిల్లా ఇంఛార్జి శ్రీధర్, జి. శంకర్ యాదవ్, లాల్ సింగ్, డా. సురక్ష ఓం ప్రకాష్, రాకేష్ జైస్వాల్, అమర్ సింగ్ జి, నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పాసం సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సురేందర్, అనంత కృష్ణ, శ్రీరామ్ వ్యాస్, నటరాజ్ నామధారి, నర్సింహ మరియు డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.