Reading Time: 2 minutes
IPL 2026 : 11 రన్స్ కొట్టడం ఈజీ అనుకున్నారేమో.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. చివరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. అయితే అంతిమంగా రాజస్థాన్ రాయల్స్ తన పోరాట పటిమతో 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా రెండో గెలుపును నమోదు చేయగా, గుజరాత్ టైటాన్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ ముందు ఉంచింది. 211 పరుగుల భారీ ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఏమాత్రం తగ్గలేదు. చివరి వరకు పోరాడి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. తృటిలో విజయాన్ని చేజార్చుకున్నప్పటికీ గుజరాత్ బ్యాటర్లు చూపిన తెగువ అభిమానులను అలరించింది.

గుజరాత్ గెలవాలంటే చివరి 6 బంతుల్లో 11 పరుగులు కావాలి. క్రీజులో రషీద్ ఖాన్, కగిసో రబడా వంటి హిట్టర్లు ఉన్నారు. రాజస్థాన్ కెప్టెన్ నమ్మకంతో బంతిని తుషార్ దేశ్‌పాండేకు అందించాడు. ఆ ఓవర్లో ప్రతి బంతి ఒక యుద్ధంలా సాగింది.

19.1: మొదటి బంతి వైడ్ పడటంతో గుజరాత్ శిబిరంలో ఆశలు పెరిగాయి. ఆ తర్వాత రీ-బాల్‌పై రబడా సింగిల్ తీశాడు.

19.2: రషీద్ ఖాన్‌కు అద్భుతమైన యార్కర్ వేయగా, అతను కూడా ఒక పరుగుకే పరిమితమయ్యాడు.

19.3: మళ్ళీ రబడాకు యార్కర్.. మళ్ళీ ఒకే రన్. ఇప్పుడు 3 బంతుల్లో 7 రన్స్ కావాలి.

19.4: మరో పర్ఫెక్ట్ యార్కర్.. రషీద్ ఖాన్ బంతిని మిస్ అయ్యాడు. డాట్ బాల్ రావడంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మొగ్గింది.

19.5: రషీద్ ఖాన్ భారీ షాట్‌కు ప్రయత్నించగా బౌండరీ లైన్ వద్ద జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. గుజరాత్ ఆశలు గల్లంతయ్యాయి.

19.6: చివరి బంతి లో-ఫుల్ టాస్.. అశోక్ శర్మ పరుగు తీయలేకపోయాడు. దీంతో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో గెలిచింది.

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో డెత్ ఓవర్లలో తుషార్ దేశ్‌పాండే చూపిన సమయస్ఫూర్తి, యార్కర్లు వేయడంలో అతని కచ్చితత్వం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయి. మరోవైపు గుజరాత్ టైటాన్స్ వరుస ఓటములతో ఆత్మరక్షణలో పడింది. బ్యాటింగ్ బాగానే ఉన్నా, కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం ఆ జట్టును దెబ్బతీస్తోంది. ఆఖరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..