
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఆర్థిక వృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష అన్నారు. కొలంబియా బిజినెస్ స్కూలులో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ముఖ్య అతిథిగా కెటిఆర్ హాజరయ్యారు. తెలంగాణ సాధించిన అద్బుత ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము అవకాశాల కోసం ఎదురు చూడలేదని, అద్భుతమైన పాలసీలు తయారు చేశామని తెలియజేశారు. మౌలిక సదుపాయాలు కల్పించామని, పెట్టుబడి దారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించామని, పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమని ప్రశంసించారు. ఐటీ, పారిశ్రామికరంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, ఐటీ ఎగుమతులు రూ.2.72 లక్షల కోట్లకు పెరగాయని కెటిఆర్ పేర్కొన్నారు. ఐటి ఉద్యోగుల సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరుకుందని, హైదరాబాద్ గ్లోబల్ ఐటి దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. అతిపెద్ద క్యాంపస్ ను అమెజాన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని, ఆవిష్కరణలకు చిరునామాగా తెలంగాణ మారిందని అన్నారు.