Reading Time: 2 minutes

చేనేత సొసైటీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితాల తయారీకి ఆదేశాలు

Caption of Image.
  • సిద్దిపేట సర్కిల్‌‌లో 35 సంఘాలు
  • షెడ్యూల్ విడుదల.. ప్రక్రియ ప్రారంభం..

సిద్దిపేట, వెలుగు: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితాల తయారీ, ఎన్నికల ప్రతిపాదనల సమర్పణకు చేనేత, జౌళి శాఖ కమిషనర్ మూడు రోజుల కింద ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా,  మే 15 వరకు కొనసాగనుంది. ఈ 33 రోజుల షెడ్యూల్‌‌ను విడుదల చేశారు. సిద్దిపేట సర్కిల్ పరిధిలో మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల పరిధిలో 35 చేనేత సహకార సంఘాలుండగా దాదాపు 8 వేలకుపైగా మంది సభ్యులున్నారు.

33 రోజుల  షెడ్యూల్ విడుదల 

చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు చేనేత, జౌళి శాఖ కమిషనర్‌‌‌‌ షెడ్యూల్‌‌ను ప్రకటించారు. ఓటరు జాబితా తయారీతో పాటు ప్రచురణ తుది జాబితాను ఆమోదించనున్నారు. శనివారం నుంచి ఏడు రోజుల పాటు బకాయిదారుల జాబితా ప్రకటన, 15 నుంచి 17 వరకు ఓటరు జాబితా తయారీ, 18 నుంచి 25 వరకు ప్రచురణతో పాటు అభ్యంతరాల స్వీకరణ, 27 నుంచి 29 వరకు మేనేజింగ్ కమిటీ అభ్యంతరాల పరిశీలన, 30 నుంచి మే 5 వరకు చేనేత, జౌళి శాఖకు జాబితా సమర్పణ, పరిశీలన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మే 6 నుంచి 8 వరకు జౌళి శాఖ ఏడీ ఆఫీస్‌‌లో ఓటరు జాబితాల ప్రదర్శన అభ్యంతరాల స్వీకరణ, 11 నుంచి 12 వరకు అందిన అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు పంపిస్తారు. మే 13 నుంచి 15వరకు ఎన్నికల నిర్వహణకు సంఘాల వారీగా జాబితాలను సమర్పిస్తారు.

జూన్ లో ఎన్నికల నిర్వహణ

చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో 33 రోజుల ప్రణాళికను అమలు చేసి జూన్ లో చేనేత సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. సొసైటీ మెంబర్స్ తమ లోన్లను రెన్యువల్ చేసుకుంటే ఓటింగ్‌‌తో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లభిస్తుంది. 2025 మార్చి 31 కటాఫ్ తేదీ నాటికి సొసైటీలో సభ్యత్వం కలిగి ఎలాంటి లోన్లు లేని వారు ఓటింగ్‌‌తో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లభిస్తుంది.

కటాఫ్ తేదీ తర్వాత సభ్యత్వం పొందిన వారికి ఓటు, పోటీ చేసే  హక్కు ఉండదు. రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు 2013లో ఎన్నికలు నిర్వహించగా 2018లో పాలక వర్గాల గడువు ముగిసిపోగా అప్పటి నుంచి గడువు పెంచుతూ  పర్సన్ ఇన్‌‌చార్జులు కొనసాగుతున్నారు. 

రెండేండ్ల కింద ఎన్నికల నిర్వహించాల్సి ఉన్నా అర్ధాంతరంగా ఆగిపోయింది. కాగా ఎన్నికల నిర్వహణకు గతంలో ఆందోళనలు జరిగాయి. ఐదేండ్లకు ఒక్కసారి నిర్వహించాల్సిన ఎన్నికలను వాయిదా వేయడం వల్ల సొసైటీల్లో అవినీతి పెరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రతి చేనేత కార్మికుడికి ఐదు లక్షల భీమా, దుబ్బాకలో టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు, కనీస వేతనం అందడంతో పాటు సొసైటీలకు వెంటనే ఎన్నికలు జరపాలని చేనేత కార్మికులు ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. 

ఓటరు జాబితాల తయారీకి కసరత్తు

జౌళి శాఖ ఆదేశాల మేరకు 33 రోజుల్లో  ఓటరు జాబితాల తయారీకి కసరత్తు చేస్తున్నాం. ఏప్రిల్‌‌ 4 నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తుది జాబితాలను మే 15 వరకు సిద్ధం చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఎన్నికలు నిర్వహిస్తాం.- సాగర్, ఏడీ చేనేత, జౌళి శాఖ 

జిల్లాల వారీగా చేనేత సహకార సంఘాలు

సిద్దిపేట    21

మెదక్    6

కామారెడ్డి    4

నిజామాబాద్    4

©️ VIL Media Pvt Ltd.