
హైదరాబాద్: మహిళా ఐఏఎస్‌ను డీఫేమ్ చేసిన కేసులో ఓ ఛానల్ రిపోర్టర్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో వ్యక్తుల శీల హననం, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించిన వీడియో ఈ సందర్భంగా వైరల్ అవుతోంది. 2025, అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వారికి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పేరుతో వ్యక్తిత్వ హననం చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. వేరే వ్యక్తుల గురించి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు.
ఫేక్ న్యూస్ సర్కులేట్ చేసి వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్ళి అబద్ధాలు ప్రసారం చేయకూడదన్నారు. చట్టానికి లోబడి ఎలాంటి విమర్శలు చేసుకున్న మాకు ప్రాబ్లం లేదని.. కానీ పరిధి దాటి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళా ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించేలా వార్త ప్రసారం చేశారన్న కారణంతో ఓ టీవీ చానల్ రిపోర్టర్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో గతంలో డీజీపీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.