Reading Time: < 1 minute

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బిజెపికి తాత్కాలికంగా లాభం జరగవచ్చు, కానీ, దీర్ఘకాలంలో దేశానికి నష్టమని సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్ (ఎక్స్‌లో) పేర్కొన్నారు. ఈ మేరకు డీలిమిటేషన్ విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ వేర్వేరు అంశాలని, మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామని, కానీ, మహిళా రిజర్వేషన్లను ఒక ముసుగుగా ఉపయోగించి జనాభా ఆధారితంగా లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్‌ను ముందుకు తీసుకురావడం సరికాదన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం ముఖ్యమని డీలిమిటేషన్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు.

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై జాతీయ ఏకాభిప్రాయం అవసరమని ఈ విషయంలో అన్ని పార్టీలతో చర్చించాలని ఆయన సూచించారు. ప్రత్యామ్నాయ నమూనాలను సైతం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి షేర్ చేశారు. డీలిమిటేషన్‌కు జీఎస్టీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) పార్ములాను సూచించారు. ప్రగతిశీల రాష్ట్రాలకు పొలిటికల్ డివిడెంట్ దక్కాలని 50 -50 గ్రోత్ ఫార్ములాను సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. లోక్ సభ సీట్ల పెంపులో దక్షిణాధి రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, జనాభా ప్రాతిపదికన కాకుండా దేశ వృద్ధిలో ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న అంశాల ఆధారంగా సీట్ల పెంపు చేపట్టాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు.