
రాష్ట్రంలో పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం(ఏప్రిల్ 13) నిజామాబాద్‌లో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. మధ్యవర్తులకు అవకాశం లేకుండా పారదర్శకంగా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా పాలనను నిబద్ధతతో కొనసాగిస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రజా పాలనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని టిపిసిసి చీఫ్ అన్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీతో పాటు నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేపట్టామని తెలిపారు. ఎలాంటి రాజీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.