
హైదరాబాద్: ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పన కు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారం పైన ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆయన తెలిపారు. ఆదివాసీ, గిరిజన,ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పైన మంత్రి సీతక్క నేతృత్వంలో గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆదివాసీ, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాం ల నిర్మాణంపైన దృష్టి సారిస్తామని వారికి సీఎం హామీ ఇచ్చారు. వీటి ద్వారా తాగు, సాగు నీటి అవసరాలను తీర్చవచ్చునని ఆయన అన్నారు. చెక్ డ్యాం లు, రహదారుల నిర్మాణం కోసం అటవీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చేలా చూస్తానన్నారు. ఆదివాసీ,గిరిజన రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వాలని చేసిన విజ్ఝప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
అటవీశాఖ అభ్యంతరాల వల్ల రహదారుల మరమ్మత్తులు ఆలస్యం అవుతాయని, కొన్ని చోట్ల కొత్త రహదారులకు అనుమతులు ఇవ్వడం లేదని వారు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా వీటిపైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా ఆయన వారికి హామీ ఇచ్చారు.ఐటీడీఏ లను మరింత బలోపేతం చేస్తామన్న ముఖ్యమంత్రి ఆదివాసీ, గిరిజనులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.