Reading Time: 2 minutes

పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు మలుపు తిరిగింది. ఇరాన్‌కు చెందిన అన్ని రేవుల దిగ్బంధం చేస్తామని తీర ప్రాంత బ్లాకేడ్‌కు దిగుతామని అమెరికా సైన్యం సోమవారం ప్రకటించింది. అంతకు ముందు పాకిస్థాన్‌లో శాంతి చర్చల విఫలం తరువాత ప్రెసిడెంట్ ట్రంప్ హర్మూజ్ దిగ్బంధం తప్పదని హెచ్చరించారు. పైగా ఇరాన్ నౌకలు ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని తమ సముద్ర మార్గ యుద్ధ వ్యూహం వెలువరించారు. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు అమెరికా నౌకాదళాలు రంగంలోకి దిగాయి.ఈ చర్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా ఈ చర్యలకు దిగితే తమ సైన్యం పర్షియన్ గల్ఫ్ పోర్టులను దిగ్బంధిస్తుందని హెచ్చరించారు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు బెదిరింపులు కుదరవని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జిసి ) ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ గల్ఫ్ వెంబడి భద్రత అనేది అందరికీ వర్తించేది లేదా ఎవరికి భద్రత ఉండకూడదని స్పష్టం చేశారు.

హర్మూజ్‌పై నౌకల రాకపోకల భద్రతను తాము పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇప్పుడు ఇరాన్ రేవులు, తీర ప్రాంతాల బ్లాకేడ్‌కు రంగం సిద్ధం అయింది. చర్చల విఫలం తరువాత ఇరాన్, అమెరికాలు ఇప్పుడు మరింత తీవ్రస్థాయిలో తలపడేందుకు కసరత్తులు చేపట్టాయి. ఇరాన్ నౌకలు ఏవీ అంగుళం కూడా కదలలేవని యుఎస్ దళాలు స్పష్ట చేశాయి.దీనికి ప్రతిగా ఇరాన్ తీవ్రస్థాయిలో స్పందించింది. వేరే శక్తులు హర్మూజ్‌కు చేరినా, రేవులను దిగ్బంధించినా మాడిపోవడం తథ్యం అని హెచ్చరించారు. అయితే యుఎస్ సెంట్రల్ కమాండ్ ( సెంట్‌కామ్) దీనిని పట్టించుకోకుండా తమ తీవ్రస్థాయి చర్యలు సోమవారం ఆరంభమవుతాయని ప్రకటించింది. ఇరాన్ రేవులకు ఏ దేశం నౌకలు రాకుండా చేస్తాం. అక్కడి నుంచి కదలకుండా చేస్తామని , ఈ విషయంలో ఎటువంటి పక్షపాతం ఉండదని వ్యాఖ్యానించారు. అరేబియా గల్ఫ్ , ఒమన్ గల్ఫ్ వెంబడి ఉన్న ఇరాన్ రేవులు, తీర ప్రాంతాల్లో ఎటువంటి నౌకా రవాణా లేకుండా చేసి తీరుతామని ప్రకటించారు.

ట్రంప్ అత్యున్నత స్థాయి వ్యూహంలో భాగంగానే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ కీలక నిర్ణయం అమలుకు దిగినట్లు స్పష్టం అయింది. అంతకు ముందు ట్రంప్ హర్మూజ్ మొత్తం దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అయితే ఇందుకు కొంచెం సడలింపుగా యుఎస్ కమాండ్ వర్గాలు తాము ఇరానేతర రేవుల నుంచి హర్మూజ్ మీదుగా నౌకలు వెళ్లేందుకు ఇంతకు ముందులాగానే వీలు కల్పిస్తామని తెలిపారు. బ్లాకేడ్ హెచ్చరికతో రెండు రోజులుగా హర్మూజ్ మీదుగా ఇంతకు ముందటి వరకూ కనీసం పరిమితంగా అయినా తిరిగిన నౌకలు కూడా కదలలేని పరిస్థితి తలెత్తింది . యుద్ధం ముందు హర్మూజ్ మీదుగా రోజుకు కనీసం 100 నుంచి 135 వరకూ వాణిజ్య నౌకలు తిరిగేవి. కాగా కాల్పుల విరమణ తరువాత రెండు మూడు రోజులు ఈ మార్గం మీదుగా 40 నౌకలు ప్రయాణించాయని మెరైన్ విశ్లేషక సంస్థ లాయడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ తెలిపింది.

బ్లాకేడ్‌కు మేం దూరం ః బ్రిటన్

అమెరికా బ్లాకేడ్‌ను తాము సమ్మతించడం లేదని, ఇరాన్ రేవుల దిగ్బంధ చర్యల్లో తాము పాల్గొనేది లేదని బ్రిటన్ తెలిపింది. ఈ మేరకు దేశ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం ప్రకటన వెలువరించారు. హర్మూజ్‌లో సీ మైన్స్ తీసివేతకు బ్రిటన్ సహకరిస్తుందనే ట్రంప్ వాదనపై స్టార్మర్ స్పందించారు. ఈ విషయంలో తమ దేశం సహకరించవచ్చు. అయితే ముందుగా పోరు పూర్తిగా నిలిచిపోవల్సి ఉందని స్పష్టం చేశారు. హర్మూజ్ మూసివేతకు కాకుండా, ఈ మార్గం పూర్తి స్థాయి రీ ఓపెన్‌కు బ్రిటన్ సైనిక శక్తిని వినియోగించడం జరుగుతుందని వివరించారు. ఈ విషయంలో తమ దేశం పలు దేశాలతో చర్చిస్తోంది. ఏ విధంగా హర్మూజ్‌ను తిరిగి రాకపోకలకు తెరవాలి, ఈ కీలక చమురు మార్గం మీదుగా నౌకలు ముందుకు పాగాలనే వ్యూహాలను ఇతరులతో కలిసి ఖరారు చేసుకుంటామని, ఇందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో పలు దేశాలు ముందుకు వచ్చాయని తెలిపారు.

చర్చలతో శాంతి : ఆగ్నేయాసియా కూటమి

ఇక శాంతి చర్చల ప్రక్రియ కొనసాగేలా చూడాలని ఆగ్నేయాసియా దేశాలు ఇరాన్, అమెరికాలకు విజ్ఞప్తి చేశాయి. కాల్పుల విరమణ జరగాలి. హర్మూజ్ మీదుగా నౌకా, విమాన రాకపోకలు సురక్షితంగా సాగేలా చూడాల్సి ఉందని తెలిపారు. 11 దేశాల కూటమి విదేశాంగ మంత్రులు ఇండోనేసియాలో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. తరువాత ప్రకటన వెలువరించారు. అమెరికా, ఇరాన్‌లకు తక్షణ సందేశం పంపించారు. ఇప్పటి యుద్ధం, హర్మూజ్ ఇతర పరిస్థితులతో పెరుగుతున్న చమురు ధరలు ఇతర పరిణామాలపై విస్తృతరీతిలో సమీక్షించారు. ప్రపంచ సంక్షభ దశలో ఆగ్నేయాసియా దేశాలు ఏ విధంగా స్పందించాలి? సహకరించుకోవాలి? అనే విషయాలపై చర్చించారు.