Reading Time: < 1 minute

లాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‎కు బిగ్ షాక్

Caption of Image.

న్యూఢిల్లీ: లాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‎కు బిగ్ షాక్ తగిలింది. లాండ్ ఫర్ జాబ్ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‎ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అయితే, కేసు విచారణ సమయంలో ట్రయల్ కోర్టు ముందు హాజరుకాకుండా ఆయనకు న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. 

కేసు ఏంటంటే..?

యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేగా మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో గల ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ జోన్‌లో జరిగిన గ్రూప్ డి నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. అభ్యర్థుల నుంచి భూములు లంచంగా తీసుకుని రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టారని లాలూ ప్రసాద్ యాదవ్‎తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై సీఐబీ కేసు నమోదు చేసింది. 

సీబీఐ ఎఫ్ఐఆర్‎ను సవాల్ చేస్తూ లాలూ ప్రసాద్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద సీబీఐ ముందస్తు అనుమతి తీసుకోలేదని.. ఏకపక్షంగా ఉన్న సీబీఐ ఎఫ్ఐఆర్‎ను క్వాష్ చేయాలని ఆయన కోరారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. 

దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లాండ్ ఫర్ జాబ్ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన అభ్యర్థించారు. సోమవారం (ఏప్రిల్ 13) జస్టిస్‌లు ఎంఎం సుందరేష్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టింది. సీబీఐ నమోదు చేసిన కేసు క్వాష్ చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. లాలూ ప్రసాద్ యాదవ్ వయస్సును పరిగణలోకి తీసుకుని ట్రయల్ కోర్టు ముందు హాజరుకాకుండా ఆయనకు న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. 

©️ VIL Media Pvt Ltd.