
ముంబైలోని అదానీ విమానాశ్రయాల వ్యవహారం ఇప్పుడు భారత్ – అమెరికా మధ్య ఒక దౌత్యపరమైన వివాదంగా మారింది. ముంబైలో ప్రస్తుతం ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్‌పోర్ట్ నుండి కార్గో విమానాలను, కొత్తగా కడుతున్న నవీ ముంబై విమానాశ్రయానికి తరలించాలని అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోంది. అయితే, అమెరికా ప్రభుత్వం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ముంబై ప్రధాన విమానాశ్రయం నుండి ప్రస్తుతం అమెరికాకు చెందిన ఫెడెక్స్ (FedEx) అనే పెద్ద కార్గో సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. అదానీ గ్రూప్ ఒత్తిడి వల్ల ఈ సంస్థ బలవంతంగా కొత్త విమానాశ్రయానికి మారాల్సి వస్తుంది. ఇది భారత్-అమెరికా మధ్య ఉన్న విమానయాన ఒప్పందాలను ఉల్లంఘించడమేనని అమెరికా రవాణా శాఖ వాదిస్తోంది. ఒకవేళ మా విమానయాన సంస్థలను బలవంతం చేస్తే, మేము కూడా ప్రతిచర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించింది.
ముంబై ప్రధాన విమానాశ్రయంలో మరమ్మతుల పనులు జరుగుతున్నాయని, దీనివల్ల కార్గో సామర్థ్యం 25% తగ్గుతుందని అదానీ గ్రూప్ చెబుతోంది. అందుకే కొన్ని విమానాలను నవీ ముంబైకి పంపిస్తున్నామని అదానీ గ్రూప్ వారు సమర్థిస్తున్నారు.
అమెరికా అధికారుల అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం మరమ్మతుల కోసం తీసుకున్న నిర్ణయం కాదు. కొత్తగా ప్రారంభం కానున్న నవీ ముంబై విమానాశ్రయాన్ని నింపడానికే అదానీ గ్రూప్ ఇలా చేస్తోందని వారు భావిస్తున్నారు. ముంబైలోని రెండు విమానాశ్రయాలూ అదానీ చేతిలోనే ఉండటం వల్ల, వారి వ్యాపార ప్రయోజనాల కోసం విమానాల రాకపోకలను ఆయన నియంత్రిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ సమస్య దౌత్యపరంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉండటంతో, భారత ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు లేఖ రాసి దీనిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఇప్పటికే అమెరికాలో కొన్ని విచారణలు ఎదుర్కొంటున్న అదానీకి, ఈ కొత్త వివాదం మరో తలనొప్పిగా మారింది.
భారతదేశ ప్రైవేట్ రంగంలో అదానీ గ్రూప్ అత్యంత భారీ విమానాశ్రయాల నిర్వాహక సంస్థగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సంస్థ దేశంలోని 7 ప్రముఖ నగరాల్లో మొత్తం 8 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.
విమానయాన రంగాన్ని మరింత విస్తరించడానికి 11 బిలియన్ డాలర్ల అంటే సుమారు 90,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టాలని చూస్తుంది. దింతో 2030 సంవత్సరం నాటికి మరో 12 కొత్త టెర్మినళ్ల కోసం బిడ్లు వేయాలని, తద్వారా వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత పెంచుకోవాలని అదానీ గ్రూప్ యోచిస్తోంది.