
బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ హక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలు సామాన్యుడికి సులభంగా అందేలా గత ఏడాది తీసుకొచ్చిన భూ భారతి చట్టం తెలంగాణ చరిత్రలో కీలక సంస్కరణగా నిలుస్తోందన్నారు. రాష్ట్రంలో నిజాం కాలం నుంచి 378 గ్రామాలను నక్షాలు లేవని మంత్రి చెప్పారు. ఇందులో ఐదు గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి భూధార్ నెంబర్ కేటాయించామన్నారు. మిగిలిన 373 గ్రామాల్లో రోవర్స్ వంటి ఆధునిక సర్వే సాంకేతికతను ఉపయో గించి రీసర్వే పనులు కొనసాగిస్తున్నామన్నారు. జిల్లాకు 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సర్వే చేపట్టబోతున్నామని, సర్వే అనంతరం హద్దులను గుర్తించి భూధార్ నంబర్ ఇస్తామన్నారు.
తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు వినియోగంలో ఉండగా,అప్పటి నుంచి ఇప్పటివరకు 77 సంవత్సరాల్లో 2.99 కోట్లకు చేరాయన్నారు.వీటికి భూధార్ నంబర్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారుచేస్తున్నామన్నారు. గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం వీలైనంత వరకు వినియోగించుకుంటు న్నామన్నారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశామన్నారు. త్వరలో మరో 400 కొనుగోలు చేయబోతున్నాం. భూ భారతి పోర్టల్ ప్రారంభించిన గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు 3.80 లక్షల పాస్‌బుక్‌లు జారీ చేసినట్లు వివరించారు.