Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: 2026 మహిళల T20 ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది. జూన్ 12న ఇంగ్లాండ్, వేల్స్‌లో ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌కు ఇంకా 60 రోజుల సమయం ఉండగా.. ట్రోఫీ పర్యటన ప్రారంభమైన సందర్భంగా సోమవారం ఐసిసి ప్రైజ్ మనీని ప్రకటించింది. అలాగే, మొట్టమొదటిసారిగా 12 జట్లతో ఈ మెగా టోర్నమెంట్ ను నిర్వహించనుంది. 

కాగా, 2024 టోర్నమెంట్ కోసం జట్లకు కేటాయించిన మునుపటి ప్రైజ్ మనీ మొత్తం US$7,958,077గా ఉంది. 2026 ఎడిషన్ కోసం ప్రైజ్ మనీని ౧౦ శాతం పెంచింది. దీంతో ఈ టోర్నీలో పాల్గొనే జట్లు.. ఇప్పుడు US$8,764,615 (సుమారు రూ. 81 కోట్ల 83 లక్షలు) అందుకోనున్నాయి.

రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ..

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 విజేత జట్టు భారీ మొత్తంలో US$2,340,000 (సుమారు రూ. 21 కోట్ల 84 లక్షలు) ప్రైజ్ మనీని అందుకోనుంది. రన్నరప్ జట్టు US$1,170,000 (సుమారు రూ. 10 కోట్ల 92 లక్షలు) సొంతం చేసుకుంటుంది. సెమీఫైనల్‌లో ఓడిన జట్లు ఒక్కోటి US$675,000 (సుమారు రూ. 6 కోట్ల 30 లక్షలు) చొప్పున పొందుతాయి. గ్రూప్ దశలో సాధించే ప్రతి విజయానికి జట్లకు US$31,154 (సుమారు రూ. 29 లక్షలు) లభిస్తుంది. ఇక, టోర్నమెంట్‌లో పాల్గొనే జట్లన్నింటికీ US$247,500 (సుమారు రూ. 2 కోట్ల 31 లక్షలు) చొప్పున లభిస్తుంది.