
ఇటీవలే పెళ్లి చేసుకున్న కుంభమేళా సెన్సేషన్ బ్యూటీ మోనాలిసా కేసులో ఆమె భర్తకు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. మైనర్ ను కిడ్నాప్ చేసి, పెళ్లి చేసుకున్నాడనే ఆరోపణలపై పోక్సో కేసు నమోదైన ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ అరెస్ట్ పై కేరళ హైకోర్టు స్టే విధించింది. మే 20 వరకు అతడిని అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే.?
2026 మార్చి 11న కేరళలోని పూవార్‌లో ఉన్న శ్రీ నయనార్ దేవాలయంలో మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అయితే, ఈ పెళ్లి సమయంలో ఆమె మైనర్ అని, కేవలం 16 ఏళ్లు మాత్రమేనని ఆరోపణలు రావడంతో NCST లోతుగా విచారణ చేపట్టింది. ఇండోర్‌లోని మహేశ్వర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రికార్డుల ప్రకారం, మోనాలిసా డిసెంబర్ 30, 2009న జన్మించింది. అంటే పెళ్లి నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమేనని కమిషన్ నిర్ధారించింది.
ఫర్మాన్ ఖాన్‌పై కేసు నమోదు..
మోనాలిసా మైనర్ అని తేలడంతో, ఆమెను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మైనర్ బాలికను వివాహం చేసుకున్నందుకు అతనిపై పోక్సో చట్టం , కిడ్నాప్ సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదైంది. కేరళలో వివాహ రిజిస్ట్రేషన్ కోసం వాడిన బర్త్ సర్టిఫికేట్ నకిలీదని విచారణలో తేలింది. దీంతో ఆ వివాహ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కమిషన్ కోర్టును కోరింది.
అయితే తమపై ఫిర్యాదుకు సంబంధించి అరెస్టు అవుతామనే భయంతో మోనాలిసా దంపతులు ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తమ వివాహం చట్టబద్ధమైనదని అందుకు మద్దతుగా మ్యారేజ్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ , ఆధార్ కార్డు వంటి అధికారిక పత్రాలను సమర్పించారని వారు వాదించారు. రికార్డులో ఉన్న పత్రాల ప్రకారం ఆ జంట మార్చి 11న వివాహం చేసుకుని ప్రస్తుతం భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్నారని న్యాయమూర్తి తెలిపారు. అయితే మే 20 వరకు ఫర్మాన్ ను అరెస్ట్ చేయకుండా అతడికి రక్షణ కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక్కసారిగా మారిన జాతకం..
2025 మహా కుంభమేళాలో రుద్రాక్ష మాలలు, పూసలు అమ్ముతూ కనిపించిన మోనాలిసా, తన నీలి రంగు కళ్లతో నెటిజన్లను కట్టిపడేసింది. ఈ పాపులారిటీతోనే ఆమెకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. పి.బిను వర్గీస్ దర్శకత్వంలో ‘నాగమ్మ’ అనే మలయాళ చిత్రంలో నటించింది. సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.