
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైరయ్యారు. సిఎం రేవంత్.. ఢిల్లీ, కేరళ టూర్లు ఆపి రైతుల కష్టాల మీద రివ్యూ చేయాలన్నారు. సోమవారం(ఏప్రిల్ 13) సంగారెడ్డి నియోజకవర్గం, సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించి..రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏటిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు తమ శనగలు కొనడం లేదని తమ దృష్టికి తీసుకురావడంతో, ఇక్కడి డీసీఎంఎస్ సెంటర్ కు రావడం జరిగిందని.. రైతులను, నిర్వాహకులను అడిగితే కోటా అయిపోయిందని చెబుతున్నారని తెలిపారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోందని విమర్శించారు. సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా.. కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదని, ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు గల్లీకి తక్కువ.. ఢిల్లీకి ఎక్కువ అన్నట్లుగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. గాలి మోటార్లలో తిరుగుతూ కేరళ, ఢిల్లీ పర్యటనల్లో ఉన్న బిజీలో వారికి రైతుల కష్టాలు పట్టడం లేదని మండిపడ్డారు.
సదాశివపేటలో కొత్తగా శనగలు కొనకపోగా, ఇప్పటికే కొన్న శనగలను కూడా బిల్లులు కావడం లేదని బస్తాలు ఖాళీ చేసి రైతులకే వెనక్కి ఇచ్చేస్తున్నారని.. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని ధ్వజమెత్తారు. మార్కెటింగ్ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారు? అని ప్రశ్నించారు.
“జొన్నల కొనుగోలుపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయమే తీసుకోలేదు. ఆరుగాలం కష్టపడ్డ రైతులు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి సగం ధరకే జొన్నలు అమ్ముకునే దుస్థితి వచ్చింది. వడ్లు కూడా రోడ్ల మీదనే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ, కేరళ టూర్లు ఆపి రైతుల కష్టాల మీద రివ్యూ చేయాలి. భూములు, కాంట్రాక్టులు, కమిషన్ల మీద రివ్యూలు చేస్తారు తప్ప గరీబ్ రైతుల కోసం మీకు సమయం దొరకదా?. కొనుగోళ్లు ఆగిపోయాయన్న కనీస సమాచారం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్పడం లేదా?. మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా?. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్ ఫ్లవర్, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. కోటా పేరుతో ఆగిపోయిన శనగల కొనుగోలును వెంటనే తిరిగి మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం” అని హరీష్ రావు అన్నారు.