
Rohit Sharma: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఇప్పటి వరకు 4 మ్యాచ్ లు ఆడిన ముంబై కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించి 3 మ్యాచ్ ల్లో ఓడింది. ఈ క్రమంలో ముంబైకి మరో బిగ్ షాక్ తగిలింది. రోహిత్ శర్మకు తొడ కండరాల గాయం (హాంస్ట్రింగ్) జట్టును కష్టాల్లోకి నెట్టింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో 13 బంతుల్లో 19 రన్స్ చేసిన హిట్ మ్యాన్, క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బంది పడ్డాడు. గాయం తీవ్రత పెరగడంతో, ఫిజియోతో చర్చించిన తర్వాత మైదానాన్ని రోహిత్ శర్మ వీడాల్సి వచ్చింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ ప్లేయర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ గాయం ఎంత తీవ్రంగా ఉందో ప్రస్తుతానికి ఖచ్చితంగా చెప్పలేమని తెలిపాడు. ఇది అభిమానుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం రోహిత్ శర్మకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నాడు ఆయనకు స్కానింగ్ పరీక్షలు జరుగుతాయని, ఆ ఫలితాల ఆధారంగానే తదుపరి మ్యాచ్‌లలో ఆడేదానిపై క్లారిటీ వస్తుందని వెల్లడించాడు.
ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడబోతుంది. జట్టు యాజమాన్యం రోహిత్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు.. ఒకవేళ గాయం స్వల్పమైంది అయినప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో అతడికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ సుదీర్ఘమైన టోర్నీ కావడంతో, కీలకమైన చివరి దశ మ్యాచ్‌ల కోసం రోహిత్‌ను సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం యోచిస్తోంది.
రోహిత్ శర్మ లాంటి అనుభవజ్ఞుడైన ప్లేయర్ దూరం కావడం ముంబై ఇండియన్స్ టీమ్ బ్యాటింగ్ లైనప్‌కు పెద్ద లోటు అని చెప్పొచ్చు. ఓపెనింగ్‌లో అతడు ఇచ్చే మెరుపు ఆరంభాలు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు, ముంబై తిరిగి విజయాల బాట ఎలా పడుతుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన ఆటగాడు త్వరగా కోలుకుని మైదానంలోకి రావాలని కోరుకుంటున్నారు.