Reading Time: < 1 minute

భార‌తీయ జ‌న‌తా పార్టీ…అధ్య‌క్షురాలిగా ఒక్క మ‌హిళ నియామ‌కం జ‌ర‌గ‌లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1980 ఏప్రిల్ 6 బిజెపి ఏర్పాటైందని.. అప్పటి నుంచి మొత్తం 15 మంది బిజెపి అధ్య‌క్షుల నియామ‌కం జ‌రిగిందని.. కాని ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీ అధ్య‌క్షురాలిగా ఒక్క మ‌హిళ నియామ‌కం జ‌ర‌గ‌లేదని విమర్శించారు. దీనిబట్టే.. బిజెపికి మ‌హిళ ప‌ట్ల గౌర‌వం, చిత్త‌శుద్ది ఉందో అర్థ‌మౌతుందన్నారు. సోమవారం సాయంత్రం సిఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయ‌క‌త్వంలో అతి ఎక్కువ కాలం ప‌నిచేసిన పార్టీ కాంగ్రెస్ మ‌హిళ‌ల‌కు అన్యాయం చేస్తుందా..? అని ప్రశ్నించారు.

“బీజేపీకి మ‌హిళ‌ను అధ్య‌క్షురాలిగా నియ‌మించుకున్న త‌ర్వాత‌ బండి సంజ‌య్ మాట్లాడాలి. బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు ద‌క్షణాది రాష్ట్రాల్లోని ఎస్సీ,ఎస్టీ, మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేకం. మా ఎంపీలు తెలంగాణ ను సాధించారు.. ఇప్పుడు పున‌ర్విభ‌జ‌న పైన కూడా పోరాడుతారు. ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌తో పాటు చిన్న రాష్ట్రాలను కూడా ఐక్యం చేస్తాం. పార్ల‌మెంట్ లో బిల్లు ను ఎలా ఆమోదిస్తారో చూస్తాం. 60 యేళ్ల‌లో మ‌హిళ‌ల కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది. 46 యేళ్ల‌లో ఒక్క మ‌హిళ ను పార్టీ అధ్య‌క్షురాలి ని బీజేపీ చేయ‌లేదు.. జ‌న‌ర‌ల్ సెక్ర‌టరీ ఆర్గ‌నైజేష‌న్ ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదు. మ‌హిళ‌ల‌ను చిన్న చూపు చూడ‌ట‌మే బీజేపీ ల‌క్ష‌ణం.. ద్వితీయ శ్రేణి పౌరులుగా మహిళ‌ల‌ను చూస్తున్నారు. స్వాతంత్య్రం తెచ్చింది, రాజ్యాంగాన్ని తెచ్చింది, రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు దేశాన్ని కాపాడుకునే బాధ్య‌త కూడా కాంగ్రెస్ దే. యాభై శాతంతో సీట్ల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ లు మోదీ ఇంటి ముందు బంట్రోతు లుగా నిల‌బ‌డాల్సి వ‌స్తుంది.. వాళ్ల అవ‌స‌రం ఇక ముందు ఉండ‌దు. అన్ని ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌తో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాల‌కు దీనిపైన లేఖ రాస్తాను” అని పేర్కొన్నారు.