
ఈ ఏడాది జరిగే మహిళల టి20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) భారీగా పెంచింది. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇందులో 12 జట్లు పోటీ పడుతున్నాయి. అయితే గతంతో పోల్చితే ఈసారి ప్రైజ్‌మనీని పెద్ద మొత్తంలో పెంచారు. 2024లో రూ. 70 కోట్లకు పైగా ఉన్న నగదు బహుమతిని ఈసారి 10 శాతం పెంచింది. 2026 ఎడిషన్‌లో 8,764,615 డాలర్లకు పెంచారు. దీంతో ఈ వరల్డ్‌కప్‌లో వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ రూ.81 కోట్లకు చేరింది. విజేతగా నిలిచే జట్టుకు రూ.21.8 కోట్లు అందజేస్తారు.
రన్నరప్ టీమ్‌కు రూ. 10 కోట్లు దక్కుతాయి. సెమీస్‌లో ఓడిన జట్లకు రూ.6 కోట్ల చొప్పున అందిస్తారు. ఇక గ్రూప్ దశలో గెలిచిన ప్రతి జట్టుకు రూ.29 లక్షలు అందజేస్తారు.ఇక టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టుకు కనీస హామీగా రూ.2.3 కోట్లు చెల్లించాలని ఐసిసి నిర్ణయించింది. కొన్నేళ్లుగా పురుషుల క్రికెట్‌కు సమానంగా మహిళలకు కూడా ఐసిసి భారీ మొత్తంలో నగదు బహుమతిని ఇస్తోంది. ఇది మహిళా క్రికెట్ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.