
న్యూఢిల్లీ: అస్సాం ముఖ్యంత్రి హిమంత బిశ్వా శర్మ భార్య రినీకీ శర్మపై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా సంచలన అరోపణల కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పవన్ ఖేరాకు తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ అస్సాం ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ దాఖలు చేసింది.. పవన్ ఖేరాకు హైకోర్టు మంజూరు చేసిన వారం రోజుల ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరింది. ఈ కేసును తక్షణమే విచారణకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఎదుట బుధవారం నాడు విచారణ జరపాలని అభ్యర్థించింది.
కాగా, అస్సాం సిఎం హిమంత బిశ్వా శర్మ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనపై అస్సాంలో కేసు నమోదు కావడంతో, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అరెస్టు నుంచి రక్షణ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 5న, రినికి భూయాన్ శర్మ బహుళ పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్నారని, విదేశాలలో ఆస్తులు కలిగి ఉన్నారని ఖేరా ఆరోపించారు. ఏప్రిల్ 9న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో ఈ వివరాలు వెల్లడించలేదని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో, గౌహతి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో ఖేరాపై కేసు నమోదైంది. ఈ ఫిర్యాదులో, ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రకటనలు చేసినందుకు సెక్షన్ 175, మోసానికి సంబంధించిన సెక్షన్ 318 వంటి భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు నిబంధనల కింద అభియోగాలు ఉన్నాయి.
అయితే, తాను అరెస్టు అయ్యే అవకాశం ఉందనే ఆందోళనలతో ఖేరా ఏప్రిల్ 7న ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లో తన నివాస చిరునామాగా హైదరాబాద్‌ను పేర్కొంటూ, ఒకవేళ పోలీసులు తనపై చర్య తీసుకుంటే చట్టపరమైన రక్షణ కల్పించాలని అభ్యర్థించాడు.