
బాంబులు, తూటాలకు పశ్చిమ బెంగాల్ ప్రజలు ఓట్లతో సమాధానం చెబుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యానికి ప్రజలు అంతం పలుకబోతున్నారని పరోక్షంగా టిఎంసిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. సోమవారంనాడు బీర్బుమ్ జిల్లాలోని మయూరేశ్వర్ ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో ఎలాంటి హింసకు పాల్పడకుండా టిఎంసి గుండాలు ఇళ్లకే పరిమితం కావాలని, లేకపోతే తాము అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని గుర్తించి తప్పకుండా శిక్షిస్తామని అమిత్ షా హెచ్చరించారు. ఈ ఎన్నికల ద్వారా చొరబాటు దారులను తరిమికొట్టే అవకాశం బిజెపికి రాబోతుందన్నారు.
దేశం నుంచి అలాంటి వాళ్లను పంపిచేస్తామన్నారు. శతబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న వారిని భయపెట్టే అధికారం మమతకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రామనవమి, సరస్వతి పూజ తదితర పండగల సమయంలో కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. 15ఏళ్లు బెంగాల్‌ను పాలిస్తున్న టిఎంసి రాష్ట్రాన్ని బుల్లెట్లు, బాంబుల నిలయంగా మార్చి వేసిందని ఆరోపించారు. పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇక్కడికి సరిపడా బలగాలను తరలించిందని అన్నారు.