
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోప్ లియో XIVని బలహీనుడు అని విమర్శించినప్పటికీ, పోప్ ఏమాత్రం తగ్గలేదు. నేను ఎప్పుడూ యుద్ధానికి వ్యతిరేకంగానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అల్జీరియా పర్యటనకు వెళ్తున్న సమయంలో పోప్ విలేకరులతో మాట్లాడుతూ… ట్రంప్‌తో నేను ఎలాంటి వాదనల్లోకి దిగను. బైబిల్ సందేశాలను కొందరు వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు, అది సరైనది కాదు అని పోప్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల వల్ల ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. శాంతి స్థాపన కోసం, దేశాల మధ్య చర్చలు జరగడం కోసమే నేను మాట్లాడతాను అని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను యుద్ధ ఉన్మాదం అని పిలుస్తూ, దానిని ఆపాలని ఆయన కోరారు.
అంతకుముందు ట్రంప్ సోషల్ మీడియాలో పోప్‌పై విరుచుకుపడ్డారు. పోప్ నేరాల పట్ల, విదేశాంగ విధానం పట్ల చాలా బలహీనంగా ఉన్నాడని… కోవిడ్ సమయంలో చర్చిలపై పెట్టిన ఆంక్షలను పోప్ ఎందుకు ప్రశ్నించలేదని ట్రంప్ నిలదీశారు. నేనే అధ్యక్షుడిగా లేకపోతే, లియో అసలు పోప్ అయ్యేవారే కాదని.. అమెరికాను విమర్శించే నాయకులు తనకు వద్దని తెగేసి చెప్పారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై అమెరికాలోని క్యాథలిక్ బిషప్పులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోప్ రాజకీయ నాయకుడు కాదు, ఆయన దేవుని ప్రతినిధి. ఆయనను ఒక రాజకీయ ప్రత్యర్థిలా చూడటం తప్పు అని వారు మండిపడ్డారు.
గతంలో కూడా ట్రంప్‌కు పోప్ ఫ్రాన్సిస్‌తో మాటల యుద్ధం ఉండేది. ఇప్పుడు పోప్ లియోతో కూడా అదే పరిస్థితి నెలకొంది. అమెరికాలో ఉన్న క్యాథలిక్ ఓటర్లలో ఎక్కువ మంది ట్రంప్‌కు మద్దతు ఇస్తుంటారు, కాబట్టి ఈ వివాదం అక్కడ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.