
న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణపై కేంద్రం, భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాలలో డూప్లికేట్ ఓటింగ్‌ను అరికట్టేందుకు బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థను అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో బిజెపి నాయకుడు, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈసి, కేంద్రంతోపాటు రాష్ట్రాలకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం నోటీసు జారీ చేసింది.
అయితే, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని వారు స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల గురించి తాను మాట్లాడటం లేదని ఆయన చెప్పడంతో, ఈ అంశంపై విచారించడానికి న్యాయస్థానం అంగీకరించింది. తదుపరి పార్లమెంటరీ ఎన్నికలు లేదా రాష్ట్ర ఎన్నికలకు కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించవచ్చో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
కాగా, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఓటింగ్ నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాలు మే 4న ఫలితాలను ప్రకటిస్తాయి.