
హైదరాబాద్ మీర్‌పేట్ జిల్లెలగూడలో దారుణం చోటుచేసుకుంది. ఓ జర్నలిస్టుపై, ఆయన కుటుంబంపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు దుండగులు.
వివరాల్లోకి వెళ్తే నేషనల్ న్యూస్ ఏజెన్సీలో జర్నలిస్టుగా పనిచేస్తున్న శివ ఏప్రిల్ 12న రాత్రి తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేశారు. శివపై ఆయన తల్లిదండ్రులపై కత్తులతో తీవ్రంగా గాయపరిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న వారిని గమనించిన స్థానికులు హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గతంలోనే తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని జర్నలిస్ట్ శివ మీర్‌పేట్ సీఐకి ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఫిర్యాదును మీర్‌పేట్ సీఐ లైట్ తీసుకోవడం వల్లే ఈరోజు ఈ ఘోరం జరిగిందని శివ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముందే హెచ్చరించినా పట్టించుకోని పోలీసుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను వెంటనే పట్టుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.