
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా పదేళ్ల పాటు రైతులకు, బలహీన వర్గాల సంక్షేమానికి కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కేసీఆర్ తో కలిసి నడవడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఏప్రిల్ 20న జగిత్యాలలో జరిగే కేసీఆర్ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వు ముసలిదానివి అయిపోయావ్.. నేను కొత్తగా వయసు దానిని తెచ్చుకుంటాననడం పద్ధతేనా? అంటూ కాంగ్రెస్ అధిష్టాన తీరుపై పరోక్షంగా నిప్పులు చెరిగారు జీవన్ రెడ్డి. నేను ముసలిదాన్నే కావచ్చు.. కానీ నేను మనిషిని కాదా? నాకు మనసు లేదా? జీవితకాలం కష్టపడి పార్టీని పెంచి పెద్ద చేస్తే.. ఇప్పుడు ముసలిదానివి అయ్యావని వయసు దానిని తెచ్చుకుంటానంటే ఎలా ఊరుకుంటాం?’ అంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు.
నువ్వు ఇంకో వయసు దానిని తెచ్చుకుంటే.. నేను కూడా మరో ముసలోణ్ణి చూసుకుంటున్నాను అంటూ జీవన్ రెడ్డి చేసిన పోలిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంలా పనిచేశామని.. కానీ విధిలేని పరిస్థితుల్లో ఆత్మగౌరవం కోసమే కాంగ్రెస్ ను వీడాల్సి వస్తోందని ఆయన స్పష్టం చేశారు.