
ఒకప్పుడు ఐపిఎల్‌కే రారాజుగా వెలుగొందిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో తడబడుతోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించి.. టేబుల్‌లో 8వ స్థానంలో స్థిరపడింది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై గెలుపు కోసం పోరాడినప్పటికీ.. పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో రాబోయే మ్యాచ్‌లు అన్ని ముంబై ఇండియన్స్ జట్టుకు కీలకంగా మారాయి. అయితే ముంబై తదుపరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ జట్టుతో ఆడనుంది.
ఈ మ్యాచ్‌కి ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా ముంబై స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొడ కండరాల గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. త్వరలో అతడు స్కానింగ్ చేయించుకుంటాడని తెలుస్తోంది. రిపోర్టుల్లో గాయం తీవ్రమైందని తేలితే.. పంజాబ్‌తో మ్యాచ్‌కి రోహిత్ అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే ఎంఐ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి రోహిత్ లేని లోటుని జట్టులో ఎవరితో భర్తి చేస్తారో వేచి చూడాల్సిందే.