Reading Time: 2 minutes
ఇంటర్ ఫలితాలు మిగిల్చిన విషాదం.. ఒక్కరోజులోనే ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13: తెలంగాణలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ ఫలితాలు పలు కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా వేరేవేరు చోట్ల ఆరుగురు విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకున్నారు. మెదక్, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఏప్రిల్ 12న ఉదయం ఫలితాలు వెలువడిన తర్వాత తమ మార్కులు చూసుకున్న పలువురు విద్యార్ధులు ఇంటర్ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినట్లు తెలుసుకుని తీవ్ర మనస్తాపం చెందారు. అనంతరం వరుస ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ జిల్లాకు చెందిన చాకలి సాయిరాం (16) రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జూలపల్లి సౌజన్య (17) 2 సబ్జెక్టుల్లో, మహబూబ్‌నగర్‌కు చెందిన జక్కుల శ్రావణి 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో.. వీరంతా ఇళ్లలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక సూర్యాపేట జిల్లాకు చెందిన యడ్ల సౌజన్య (16) జువాలజీ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. ఇంట్లోని బాత్రూంలో ఉరేసుకుని తనువు చాలించింది. హైదరాబాద్ వారాసిగూడకు చెందిన మరో విద్యార్ధి కోయడ కల్యాణి బేగం (16) నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. ‘గుడ్ బై.. నా ఇంటర్ రిజల్ట్ చూడొద్దు’ అని సోదరుడికి ఫోన్‌లో మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం దూసకల్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి అభి యాదవ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అభి యాదవ్ రెండు సబ్జెక్టులలో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లాకు చెందిన గంగదేవుల అక్షంత్ (17) అనే విద్యార్ధి ఫలితాలకు ముందే ఫెయిల్ అవుతాననే భయంతో రెండు రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఆదివారం విడుదలైన ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో కలిపి ఏకంగా 347 మార్కులతో ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడు. కుమారుడి మార్కులు చూసిన మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మార్కులేనా జీవితమంటే..?

ప్రియ నేస్తం.. మార్కులు, పరీక్షల కోసమే నువ్వు పుట్టలేదు. ఫెయిల్ అయితే మళ్లీ చదువు.. మే నెలలో 13వ తేదీ నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలు కసిగా రాసి పాసై చూపించాలి. అసలు చదువే ఇష్టం లేకపోతే పుస్తకం ముట్టకు. నీకు అభిరుచి ఉన్న మరేదైనా రంగంలో నీ సత్తా చాటు. జీవితమంటేనే ధైర్యంగా పోరాడటం. అంతేగానీ.. ఇలా అర్ధాంతరంగా జీవితం చాలిస్తే.. అందరూ నిన్ను పరికిపందగా భావిస్తారు. అంతేకాదు నువ్వే లోకంగా బతుకుతున్న నీ తల్లిదండ్రులకు తీరని వేదన మిగులుతుంది. ఆత్మహత్య ఆలోచన వస్తే వెంటనే ఆ ఆలోచనను తుంచివేయ్.. చుట్టూ ఉన్న వాళ్లు మహా అయితే వారం, నెల రోజులు నీ గురించి మాట్లాడుతారు. ఆ తర్వాత ఎవరి పనిలో వాళ్లు మునిగిపోతారు. ఎవరో ఏదో అన్నారని నీవెందుకు శిక్ష విధించుకుంటావ్.. ఓ సారి ఆలోచించు నేస్తం!!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.