Reading Time: 2 minutes
Uk France New Strategy Hormuz Strait Trump Nato Tensions

ట్రంప్‌నకు పూర్తిగా నాటో దూరం అయిపోతుందా? ఇకపై సంబంధాలు అంతంత మాత్రమేనా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి ఏ విధంగానూ నాటో మద్దతు ఇవ్వలేదు. కనీసం వైమానిక స్థావరం ఇచ్చేందుకు కూడా బ్రిటన్ నిరాకరించింది. దీంతో ట్రంప్ ఒక రేంజ్‌లో నాటోపై విరుచుకుపడ్డారు. పిరికి నాటోగా అభివర్ణించారు. మా సాయం లేకుండా మనుగడ సాధించగలదా? అని కూడా ట్రంప్ ప్రశ్నించారు.

ఇటీవల ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో హార్ముజ్‌ను దిగ్బంధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అనేక దేశాలు కూడా కలుస్తాయని కూడా ప్రకటించారు. కానీ ఆ దేశాల పేర్లు మాత్రం వెల్లడించలేదు. అయితే ట్రంప్‌ దిగ్బంధంలో కలవబోమని బ్రిటన్, ఫ్రాన్స్ తేల్చి చెప్పాయి.

తాజాగా హార్ముజ్‌పై బ్రిటన్-ఫ్రాన్స్ కొత్త వ్యూహాన్ని రూపొందించాయి. అయితే తమ కొత్త వ్యూహంలో చేతులు కలపాలని 40కు పైగా దేశాలను బ్రిటన్ ఆహ్వానించింది. తాము అమెరికా దిగ్బంధన ప్రణాళికలో భాగం కాబోమని.. ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తు్నట్లుగా ఫ్రాన్స్, బ్రిటన్ ప్రకటించాయి. సమన్వయంతో కూడిన ప్రణాళికను చర్చించడానికి ఈ వారమే ఒక శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా బ్రిటిన్ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. ఈ సమావేశంలో హార్ముజ్‌పై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు.

మాక్రాన్..
‘‘రాబోయే రోజుల్లో యూకేతో కలిసి హార్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధిరించేందుకు శాంతియుత మిషన్‌తో ముందుకెళ్తున్నామని.. మాతో సహకరించే దేశాలతో ఒక సమావేశాన్ని నిర్వహిస్తాం.’’ అని మాక్రాన్ రాసుకొచ్చారు.

ట్రంప్ దిగ్బంధంలో నాటో చేతులు కలపకపోవడం అమెరికాకు పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు. అన్ని దేశాల మద్దతు హార్ముజ్ దిగ్బంధించాలని ట్రంప్ వ్యూహం పన్నారు. కానీ అందుకు భిన్నంగా నాటో స్వరం వినిపించింది. ట్రంప్‌తో కలిసే ప్రసక్తే లేదని బ్రిటన్, ఫ్రాన్స్ తేల్చి చెప్పాయి. దీంతో ట్రంప్‌తో నాటోకు పొసగడం లేదని అర్థమవుతోంది. భవిష్యత్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.