Reading Time: 1 minute

IPL 2026: ఇ’షా‌న్‌దార్’ బ్యాటింగ్.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ 

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో, నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆరెంజ్ ఆర్మీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మను జోఫ్రా ఆర్చర్ అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (18) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు.

ఇషాన్- క్లాసెన్ కిరాక్ బ్యాటింగ్: 
ఈ దశలో కెప్టెన్ ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ కలిసి రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కలిసి 88 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈనేపథ్యంలో ఇషాన్ కిషన్ కేవలం 44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 91 పరుగులు చేసి సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. మరోవైపు, హెన్రిచ్ క్లాసెన్ కూడా 26 బంతుల్లో 40 పరుగులు చేసి తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

చివర్లో నితీష్, సలీల్ మెరుపులు: 
మిడిల్ ఆర్డర్‌లో నితీష్ కుమార్ రెడ్డి (28) భారీ షాట్లతో అలరించగా, సలీల్ అరోరా కూడా ధాటిగా ఆడి స్కోరును 200 దాటించాడు. అనికేత్ వర్మ (6) రనౌట్ అయినప్పటికీ, చివరి ఓవర్లో వచ్చిన 13 పరుగులతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, డొనోవాన్ ఫెరీరా తలో వికెట్ దక్కించుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ గెలవాలంటే ఇప్పుడు 120 బంతుల్లో 217 పరుగులు చేయాల్సి ఉంది.  

 

©️ VIL Media Pvt Ltd.