
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ పార్టీకి చెందిన పార్దాపూర్ ఏరియా కమాండర్ రూపి అలియాస్ భాగ్య మరణించింది.
అసలేం జరిగింది?
భద్రతా బలగాలకు అందిన పక్కా సమాచారంతో కాంకేర్ అడవుల్లో గాలింపు చేపట్టగా, మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ కాల్పుల్లో భాగ్య మరణించగా.. మరో 10 మంది మావోయిస్టులు అడవిలోకి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఎవరీ భాగ్య?
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన భాగ్య కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే, అంటే 2004లో మావోయిస్టు ఉద్యమ బాట పట్టారు. రెండు దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ,ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతాల్లో అత్యంత కీలకంగా పనిచేశారు. మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి భార్యగా గుర్తింపు పొందిన ఆమెపై ప్రభుత్వం 25 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. గత ఏడాది మాన్పూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె భర్త విజయ్ రెడ్డి మృతి చెందారు.
గ్రామంలో విషాదం
భాగ్య మరణవార్త ఆమె స్వగ్రామమైన ధర్మారంలో విషాదం నింపింది. తొమ్మిదేళ్ల క్రితమే తండ్రి నర్సయ్య మరణించగా.. ఇప్పుడు చేతికందిన కూతురు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో తల్లి లక్ష్మి, సోదరి బోరున విలపిస్తున్నారు. 20 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిన బిడ్డ.. ఇలా విగతజీవిగా మారుతుందని ఊహించలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.