
ఇరాన్-అమెరికా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. అరేబియా గల్ఫ్ తో పాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోని ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించడంతో నౌకల రాకపోకలపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధి దగ్గర 15 భారతీయ నౌకలు చిక్కుకున్నాయి. ఇందులో గ్యాస్ కారియర్లు, క్రూడాయిల్ ట్యాంకర్ల పాటు ఓ కెమికల్ కంటైనర్ ఉన్నట్లు తెలుస్తోంది.
దీనిపై అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన మొత్తం 15 భారత జెండా నౌకలను వెనక్కి తీసుకురావడానికి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. “మేము, విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ, మా నౌకలను వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. హోర్ముజ్ జలసంధి నుండి మా నౌకలు ప్రయాణించడం సాధ్యమైన వెంటనే, ఆ నౌకలు తిరిగి వస్తాయి” అని ముఖేష్ తెలిపారు.