
బ్రిటన్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు బ్రిటన్ షాక్ ఇచ్చింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని దిగ్భంధనం చేస్తామన్న అమెరికా నిర్ణయాన్ని బ్రిటన్ వ్యతిరేకించింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ బీబీసీతో మాట్లాడుతూ.. ఇరాన్ సమీపంలో హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేయాలన్న అమెరికా చర్యకు బ్రిటన్ సపోర్ట్ ఇవ్వబోదని తెలిపారు.
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెంచకుండా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, దానిని పూర్తిస్థాయిలో పనిచేసేలా ఉంచడంపై యూకే దృష్టి సారించిందని పేర్కొన్నారు. తమపై అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ సరైన ఆధారాలు, స్పష్టమైన ప్రణాళిక లేకుండా ఇరాన్ వివాదంలో యూకే జోక్యం చేసుకోదని తేల్చిచెప్పారు. ఒక విస్తృత యుద్ధంలోకి ప్రవేశించకుండా ఉండటమే తమ ప్రభుత్వ వైఖరి అని.. ప్రస్తుత పరిస్థితిలో బ్రిటన్ జాగ్రత్తగా, స్వతంత్రంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
హార్మూజ్ జలసంధిని మేమే మూసేస్తం: ట్రంప్
పశ్చిమాసియాలో ఆరు వారాలుగా సాగుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో హార్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. ఇరాన్ చర్యతో ఇక లాభం లేదనుకున్న ట్రంప్ హార్మూజ్ జలసంధిని ఇరాన్ కాదు మేమే దిగ్భంధనం చేస్తామని ప్రకటించారు. ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లి వచ్చే నౌకలు, అలాగే ఇరాన్‌కు పన్ను చెల్లించి హార్మూజ్‌లో రాకపోకలు సాగించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని తెలిపారు.
ఈ మేరకు అమెరికా నౌక దళానికి ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. అమెరికా చర్యలతో హార్మూజ్ జలసంధి దగ్గర ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు మళ్లీ బ్రేక్ పడితే ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై గణనీయంగా పడనుంది. ముడి చమురు లేక ప్రపంచ దేశాల్లో అల్లాడిపోయే అవకాశం ఉంది.