
తాను ఉత్తర భారత దేశానికి వలస వెళతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. వలసపోవడానికి తాను అవకాశవాదిని కాదని, రేవంత్ రెడ్డిని అంతకంటే కాదని ఆయన విమర్శించారు. తాను చచ్చినా బతికినా బిజెపిలోనే ఉంటానని ఆయన తెలిపారు. తాను చనిపోతే తన శవంపై కప్పేది కాషాయ జెండానే అని ఆయన తెలిపారు. ఆ సన్నివేశం చూడడానికైనా రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు బతికి ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. తాను చచ్చినా, బతికినా, ఓడినా, గెలిచినా కేరాఫ్ అడ్రస్ కరీంనగరేనని ఆయన చెప్పారు. తన రక్తంలోనే జాతీయవాదమనే డీఎన్‌ఏ ఉందన్నారు.
వలసవాది, అవకాశవాదానికి ప్రతిరూపం రేవంత్ రెడ్డి అని ఆయన విమర్శించారు. పాలమూరు నుంచి మల్కాజ్ గిరి దాకా వలస పోయింది రేవంత్ రెడ్డేనని ఆయన ధ్వజమెత్తారు. మహిళా బిల్లును వ్యతిరేకించే మీరు కూడా తమను విమర్శిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మీరు నిజంగా మహిళా రిజర్వేషన్లకు సానుకూలమైతే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో దాదాపు 30 ఏళ్లకుపైగా కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ ఉన్నా మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.