Reading Time: 2 minutes

కాశీలో 40 శాతం నకిలీ సాధువులే?.. ఆర్య వ్యాఖ్యలపై హిందూ సంఘాల ఆగ్రహం!

Caption of Image.

తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు ఆర్య ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’ (Mr. X)  ప్రమోషన్ల సందర్భంగా వారణాసిలోని సాధువుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఏప్రిల్ 17, 2026న విడుదల కానున్న ఈ సినిమా కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆర్య తన పాత జ్ఞాపకాలను పంచుకుంటూ ఈ వివాదానికి తెరలేపారు.

వారణాసిలో 40 శాతం నకిలీలే?

ప్రముఖ దర్శకుడు బాల రూపొందించిన ‘నాన్ కడవుల్’ (Naan Kadavul) షూటింగ్ సమయంలో వారణాసిలో గడిపిన రోజులను ఆర్య గుర్తు చేసుకున్నారు. మేము వారణాసిలో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడి పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ ఉన్న సాధువులలో సుమారు 40 శాతం మంది నకిలీ స్వాములే. చాలా మంది నేరాలు చేసి, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అక్కడ తలదాచుకుంటున్నారు. హత్యలు చేసిన వారు కూడా సాధువుల వేషంలో అక్కడ తిరుగుతుంటారు అని ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాధువులను వారి పేరు అడిగితే కేవలం ‘స్వామి’ అని చెబుతారు. వారికి రేషన్ కార్డులు ఉండవు, పాన్ కార్డులు ఉండవు, కనీసం ఐడి ప్రూఫ్ కూడా ఉండదు. 60 శాతం మంది నిజమైన సాధువులు ఉన్నప్పటికీ, మిగిలిన 40 శాతం మంది కేవలం మూడు నాలుగు ఏళ్లు అక్కడ ఉండి, గొడవలు సద్దుమణిగాక వెళ్లిపోయే క్రిమినల్స్ అని వ్యాఖ్యానించారు.

కుంభమేళాలో AK-47లు!

షూటింగ్ సమయంలో పోలీసులు తమను హెచ్చరించిన తీరు గురించి కూడా ఆర్య మాట్లాడారు. కుంభమేళా సమయంలో పోలీసులు మాతో మేము కేవలం 50 వేల మందిమే ఉన్నాము. మా దగ్గర సాధారణ తుపాకులు ఉన్నాయి. కానీ అక్కడ గుంపులో ఉన్న కొందరి దగ్గర AK-47లు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా షూటింగ్ చేసుకోండి అని చెప్పారు. అక్కడ ఎలాంటి మనుషులైనా ఉండవచ్చు అని పేర్కొన్నారు ఆర్య.

ఆర్య వ్యాఖ్యలపై సీరియస్..

ఆర్య చేసిన ఈ వ్యాఖ్యలు హిందూ సంఘాలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. కాశీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉండే సాధువులను నేరస్థులతో పోల్చడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక సినిమా ప్రమోషన్ కోసం పవిత్రమైన సాధువుల వ్యవస్థను కించపరచడం తగదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆర్య కేవలం తను చూసిన అనుభవాలనే చెప్పాడని మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

మను ఆనంద్ దర్శకత్వం వహించిన ‘మిస్టర్ ఎక్స్’ చిత్రంలో ఆర్యతో పాటు గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. అయితే ఆర్య చేసిన ఈ వివాస్పద వ్యాఖ్యలు ‘మిస్టర్ ఎక్స్’ ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో #BoycottMrX వంటి ట్యాగ్‌లు కనిపిస్తుండటంతో చిత్ర యూనిట్ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

©️ VIL Media Pvt Ltd.