Reading Time: 3 minutes

విశ్వనగరంగా పేరుగాంచిన గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రవాణా వ్యవస్థకు విశేషమైన స్థానముంది. నగరం విస్తరణతోపాటు రవాణా వ్యవస్థలు కూడా పెరగాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతూ మెట్రోపాలిటన్ సిటీగా ప్రత్యేక గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో రోజూ లక్షలాదిమంది పలు అవసరాల నిమిత్తం రాకపోకలు సాగిస్తుండటంతో నగరానికి సమర్థవంతమైన రవాణా వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది. కాలుష్యం, ట్రాఫిక్ పద్మవ్యూహం లేకుండా తక్కువ ఖర్చుతో నగరంలో ప్రయాణం సాగించాలంటే వ్యక్తిగత వాహనాలకంటే ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రజా రావాణాలో భాగంగా కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర ఆర్‌టిసి బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటిఎస్ సర్వీసులు వేగంగా విస్తరిస్తున్న నగర ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో 2050 నాటికి ప్రజా రవాణా వ్యవస్థను నగరానికి సరిపోయేలా వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం ఆహ్వానించదగ్గ పరిణామం.

చరిత్రాత్మక హైదరాబాద్ నగరంలో నిజాం కాలం నుండే ప్రజా రవాణా వ్యవస్థ విస్తృతంగా అందుబాటులో ఉండేది. గుర్రపు బండ్ల టాంగాలతో మొదలైన హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కాలక్రమేణా అభివృద్ధి చెందింది. నిజాం స్టేట్ రైల్వే నేతృత్వంలో 1870లో నగరంలో రైల్వే వ్యవస్థ ప్రారంభమైంది. భారత దేశంలోని తొలిసారిగా 1932లో నిజాం ప్రభుత్వం బస్సు సేవలను ప్రారంభించింది. లండన్ నుండి పాత బస్సులను తెప్పించి నగరంలో తిప్పారు. ఒక్కో బస్సులు 15 నుండి 20 మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. తొలుతగా 27 బస్సులు, 160 మందికిపైగా సిబ్బందితో ప్రారంభించిన ప్రజా రవాణా వ్యవస్థ యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచింది.ప్రజా రవాణా వ్యవస్థలో ఘన చరిత్ర గల హైదరాబాద్‌లో కాలానికి అనుగుణంగా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా వేగవంతంగా విస్తరిస్తున్న నగరం, పెరుగుతున్న జనాభాకు సరిపోవడం లేదు. నగరం నలువైపులా శివార్లలోని బస్తీలు, కాలనీల వరకు ఆర్‌టిసి బస్సులు నడుస్తున్నాయి. సిటీలో వేగవంతమైన ప్రయాణం కోసం మూడు మార్గాల్లో మెట్రో రైలు పరిగెడుతోంది.

అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే సరసమైన ధరలో ఎంఎంటిఎస్ సేవలు అందిస్తోంది. అయినా హైదరాబాద్ బృహత్ నగరం జనాభా కోటిన్నరకు చేరుకుంటున్న దశలో ప్రస్తుత ప్రజా రవాణా వ్యవస్థ ప్రజావసరాలను తీర్చడంలేదని కచ్చితంగా చెప్పవచ్చు. సరిపోని ప్రజా రవాణాతో ప్రజలు ప్రయివేట్, వ్యక్తిగత వాహనాల రవాణా వైపు చూడాల్సి వస్తుంది. వాహనాల పెరుగుదలతో నగరంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా, వాహనాల సంఖ్యకు తగ్గట్టు రోడ్ల విస్తరణ జరగకపోవడంతో ట్రాఫిక్, కాలుష్య సమస్యలొస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్‌ఎంఎ) 2050 సమగ్ర మొబిలిటి ప్లాన్ (సిఎంపి)కి సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం 2024 ఆగస్టు 31నాటికి నగరంలో 92.13 లక్షల వాహనాలుండగా, వాటిలో కార్లు 16.15 లక్షలు, ద్విచక్రవాహనాలు 67.58 లక్షలున్నాయి. భారీగా సొంత వాహనాలతో నగరంలో కాలుష్యం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 నుండి 170 మధ్య ఉండడం ప్రమాదకరాన్ని హెచ్చరిస్తోంది. రోడ్లపై అధిక వాహనాల ప్రయాణంతో నగరంలో సాధారణ సమయాల్లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట, పీక్ సమయాల్లో గంటకు 16 కిలోమీటర్ల ప్రయాణమే సాధ్యమవుతుండడంతో ట్రాఫిక్ సమస్యను కళ్లకు కడుతున్నాయి.

గ్రేటర్ నగరంలో ప్రస్తుతమున్న ప్రజా రవాణా, మౌలిక వసతులు సరిపోవడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రోజూ 32,000 వేల ట్రిప్పుల సర్వీసులతో మూడు వేలకుపైగా ఆర్‌టిసి బస్సులు 25 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నా కిక్కిరిసిపోతుండడంతో ప్రజలు ఎక్కడానికి భయపడుతున్నారు. ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి, రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. మియాపూర్ నుండి ఎల్‌బినగర్ వరకు, జెబిఎస్ నుండి ఎంజిబిఎస్ వరకు, నాగోల్ నుండి రాయదుర్గం వరకు మూడు మార్గల్లో సుమారు 70 కిలోమీటర్లలో 57 స్టేషన్ల మీదుగా మెట్రో రైలు ప్రయాణికులు సేవలందిస్తున్నా రద్దీ సమయాల్లో అక్కడ కాలుపెట్టే పరిస్థితులు కూడా ఉండడం లేదు. మరో వైపు దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఎంఎంటిఎస్ రైళ్లు సుమారు 120 కిలోమీటర్ల పైగా సేవలందిస్తున్నాయి. ఈ రైళ్లలో తక్కువ ధరతో ప్రయాణం లభిస్తున్నా ఉన్న కొద్ది మార్గంలో కూడా సమయపాలన పాటించకపోవడంతో నగర వాసులకు వీటిపై భరోసా లేదు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ మూడు ప్రజా రవాణా వ్యవస్థలు నగర ప్రయాణికులకు ఏమాత్రం సరిపోకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా ప్రజారవాణా అభివృద్ధి ఆవశ్యకత గుర్తించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి ఆచరణలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనికి ఏటా రూ. 15 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2026 నుండి 2025 వరకు మెట్రో కోసం రూ. 1,65,873 కోట్లు, ఎంఎంటిఎస్ కోసం రూ. 22,378 కోట్లు, బస్సుల కోసం రూ. 7336 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. నగర ప్రజారవాణాపై ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక (ఇడిపి), సిఎంపి 2050 వరకు చేపట్టాల్సిన పలు ప్రణాళికలను బ్లూ, గ్రీన్ విభాగాలుగా విభజించి ప్రతిపాదించింది. 2050 వరకు సమగ్ర రవాణా ప్రణాళిక అమలు కోసం రూ. 4 లక్షల కోట్లు అవసరమని గుర్తించారు.

నగరంలో మెట్రో రైలును మూడు దశల్లో 2050 నాటికి 556.6 కిమీలకు, ఎంఎంటిఎస్ నెట్‌వర్క్‌ను 2050 నాటికి 336.4 కిమీలకు విస్తరించాలని ప్రతిపాదించారు. ప్రత్యేక బస్ మార్గాలను ఏర్పాటు చేయడంతోపాటు బిఆర్‌టిఎస్, డిబిఎల్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2050 నాటికి 7 బస్, ట్రక్ టెర్మినళ్లు ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా 29 చోట్ల వంతెనలు నిర్మించనున్నారు. 2030 నుండి 2040 వరకు, పిమ్మట 2050 వరకు దశలవారీగా కొత్త రోడ్లు, హైవేలు, 18 మీటర్ల కారిడార్లు మొత్తం మీద 2050 నాటికి నగరంలో 19 వేల కిమీలకు పైగా రోడ్ నెట్‌వర్క్‌ను పెంచేందుకు ప్రణాళిక్లు రూపొందించారు. అంతేకాక 2050 నాటికి 75 గ్రేడ్ సెపరేటర్లు, 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌లు, 34 ఆరఒబిలు, 16 ఆర్‌యుబిలు, 8 చోట్ల ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించేందకు విస్తృతమైన ప్రణాళికలను రూపొందించారు.

– ఐవి మురళీకృష్ణ శర్మ