
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ని రోహిత్ శర్మ సూపర్ స్టార్ట్ చేశాడు. 200+ స్ట్రైక్ రేట్ తో హాఫ్ సెంచరీ చేసిన అతడిపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. కేవలం 38 బంతుల్లోనే 78 రన్స్ చేసిన ముంబై జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఐపీఎల్ లోని మిగతా టీమ్స్ కి హెచ్చరించాడు. రోహిత్ 2.0 రెడీ అయింది.. ప్రత్యర్థి జట్లు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశాడు.
కోల్‌కతాపై రోహిత్ శర్మ ఆటను చూసిన తర్వాత ఒకటే చెబుదామని ఉందా అని అనిల్ కుంబ్లే పేర్కొన్నారు. మైదానంలో అతడు బంతిని ఎదుర్కొన్న తీరును చూస్తే ప్రత్యర్థికి హెచ్చరికలు పంపినట్లుగా అనిపిస్తోంది.. అత్యుత్తమ ఫామ్ లో ఉన్నప్పటి రోజులను మళ్లీ గుర్తు చేసేశాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ముజరబాని లాంటి బౌలింగ్ లో ఈజీగా సిక్సులు కొట్టేశాడు. స్వల్ప విరామం తర్వాత స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. లయను అందుకోవడానికి కనీసం ఐదారు రోజుల సమయం పడుతుంది. కానీ, రోహిత్ పై ఆ ప్రభావం ఏమీ కనిపించలేదని కుంబ్లే వెల్లడించారు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కీలకం.. కానీ, నరైన్ తన నాలుగు ఓవర్ల కోటా కూడా పూర్తి చేయలేకపోయడం అందర్ని షాక్ కి గురి చేసింది. రోహిత్– ర్యాన్ -రికెల్టన్ దెబ్బకి పవర్ ప్లేలోనే అతడికి బౌలింగ్ ఇవ్వకపోవడం తీవ్ర నిరుత్సాహ పరిచింది. సునీల్ నరైన్ బౌలింగ్ కి వచ్చే సమయానికి జరగాల్సిన పూర్తి నష్టం జరిగిపోయింది. ఇక్కడే కేకేఆర్ తమ విజయావకాశాలను పూర్తిగా దెబ్బ తీసుకుంది. వారి వనరులను కాస్త మెరుగ్గా ఉపయోగించుకోవాలని అనిల్ కుంబ్లే పేర్కొన్నారు.