Reading Time: < 1 minute

పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనకు ముగింపు పలకాలి

కేరళలో మార్పు కోసం యూడిఎఫ్‌ను గెలిపించాలి

రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: కేరళ ప్రజలారా మీ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. పది సంవత్సరాల ఎల్డీఎఫ్ అసమర్ధ పాలనకు ముగింపు పలకండి, అవినీతి పాలనను అంతం చేయండి, విభజన రాజకీయాలను తిరస్కరించండి, అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన కోసం యూడిఎఫ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వ మార్పు కోసం కాదు, కేరళ భవిష్యత్ కోసమని ఆయన అన్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించి, యూడిఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలోని ఆడూరు, అరుణ్ ముల నియోజకవర్గాల్లో కెఎస్‌ఆర్టీసి జంక్షన్ వద్ద జరిగిన ఏఐసిసి అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు.

అవినీతి పాలనకు కేరాఫ్ ఎల్డీఎఫ్ ప్రభుత్వం

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కేరళలో పది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎల్డీఎఫ్ పాలన ప్రజలను పూర్తిగా నిరాశ పరిచిందని ఆయన ఆరోపించారు. పది సంవత్సరాలుగా కేరళను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం అవినీతి పాలనకు ప్రతీకగా మారిందని, యువతకు ఉద్యోగాలు లేవని, పెట్టుబడులు రావడం లేదని, సంక్షేమం కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైందని మంత్రి విమర్శించారు. దేశవ్యాప్తంగా విభజన రాజకీ యాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచే బిజెపికి కేరళలో స్థానం లేదని ప్రజలు ఇప్పటికే పలుమార్లు తీర్పు ఇచ్చారన్నారు.

రాష్ట్రంలో నిజమైన ప్రత్యామ్నాయం యూడిఎఫ్ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలనను ఉదాహరణగా చూపుతూ, తాము ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చుతున్నామో దేశం చూస్తోందని, అదే విధంగా కేరళలో కూడా ప్రజా పాలన తీసుకురాగలిగేది కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.