
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కాగ్
అప్పులు తెచ్చారు..కానీ ఆస్తులు పెంచలేదు
కాగ్ రిపోర్టుతో అయినా కళ్లు తెరవండి
బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: రెండేళ్ల మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్ధిక క్రమశిక్షణ గాడి తప్పిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్(కాగ్) నివేదిక స్పష్టం చేసిందని బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు అన్నారు. కాగ్ రిపోర్టు రేవంత్ సర్కార్‌కు చెంప పెట్టు లాంటిదని విమర్శించారు. తాము ఈ ప్రభుత్వ పని తీరుపై నిలదీస్తున్న అంశాలనే కాగ్ ప్రస్తావించిందని ఒక ప్రకటలో పేర్కొన్నారు. సంక్షేమ రంగానికి, సాగునీటి రంగానికి ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో భారీగా నిధులు పెట్టి ఖర్చు పెట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందిన విషయాన్ని కాగ్ తప్పుపట్టిందని చెప్పారు. అంకెల్లో గోల్ మాల్.. ఆచరణలో అంతకన్నా గోల్ మాల్ ఉందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టిందని విమర్శించారు.
తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆస్తులుగా మలచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ తేల్చి చెప్పిందని, రాష్ట్రాన్ని భారీ రెవెన్యూ లోటు దిశగా తీసుకెళ్తుతున్నారని కాగ్ చెప్పకనే చెప్పిందని పేర్కొన్నారు. మాటలు మూరెడు-చేతలు చారెడు కూడా లేవని ఈ చేవ లేని సర్కార్‌కు కాగ్ అక్షింతలు వేసిందని తెలిపారు. తాము ప్రభుత్వాన్ని తప్పుబడితే పెడబొబ్బలతో తమ మీద దాడి చేస్తారని, కాగ్ రిపోర్టు తర్వాత కూడా ఇంకా ఆవే అబద్దాలను కొనసాగిస్తారా..? అని ప్రశ్నించారు.
2024 -25 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన రిపోర్టులోనే కాగ్ అనేక ప్రభుత్వ లోపాలను తప్పు పట్టిందని, 2025 -26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వం లెక్కలేనన్ని తప్పులు చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్లు కూడా డొల్ల అని కాగ్ రిపోర్టు 2024 -25 కుండబద్దలు కొట్టిందని విమర్శించారు. మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప దాటదు అనడానికి కాగ్ రిపోర్టు మరో ఉదాహరణ అని, ఈ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అని చెప్పడానికి కాగ్ రిపోర్టు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. అప్పులు తెచ్చి కూడా ఆరు గ్యారంటీలను అమలు చెయ్యలేని అసమర్ధ సర్కార్ ఇది అని కాగ్ పరోక్షంగా తప్పుపట్టిందని పేర్కొన్నారు.
కాగ్ నివేదికతోనైనా కళ్ళు తెరవాలని, పిచ్చి కూతలు మాని ప్రజలకు పనికొచ్చే విషయాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. బలంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పునాదులు ధ్వంసం చేసి తెలంగాణను దివాలా రాష్ట్రంగా మార్చొద్దని, ప్రతీకార రాజకీయాలు, రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధానాలకు స్వస్తి పలికి పాలన మీద దృష్టి సారించాలని హితవు పలికారు.