Reading Time: 2 minutes

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా ? అయితే మీరు ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే!

Caption of Image.

చిన్నపిల్లల్లో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వ్యసనం ఊబకాయం అనే తీవ్రమైన సమస్య హెచ్చరిస్తోంది. తల్లిదండ్రులు ఇంటి పనులు త్వరగా అవ్వడం కోసం పిల్లలకు ఫోన్ అలవాటు చేస్తున్నారు, కానీ అది వారి ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసా…

 పిల్లలు ఏడవకుండా అన్నం తినాలని చాలామంది ఫోన్‌లో కార్టూన్లు పెడుతుంటారు. దీనివల్ల పిల్లలు ఆహారం రుచిని, రంగును గమనించకుండా మెకానికల్ గా తినేస్తుంటారు. దింతో మెదడుకు కడుపు నిండిందనే సంకేతం అందక, వారు అతిగా తినేస్తుంటారు.

మన భారతదేశంలో ఐదేళ్ల లోపు పిల్లలు కూడా ఊబకాయం బారిన పడుతున్నారు. రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సేపు స్క్రీన్ చూసే పిల్లల్లో 43% మంది అధిక బరువుతో ఉంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

 స్మార్ట్‌ఫోన్ వల్ల కేవలం బరువు పెరగడమే కాదు, చిన్న వయసులోనే ఫ్యాటీ లివర్ అంటే కాలేయ సమస్యలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే డయాబెటిస్ వచ్చే అవకాశం, విటమిన్ డి లోపం, ఫోన్ నుంచి వచ్చే ‘నీలి కాంతి’ వల్ల నిద్ర పట్టక, హార్మోన్లు బ్యాలెన్స్   సమస్యలు వస్తుంటాయి. 

డాక్టర్ల హెచ్చరిక 
 ఫోన్ వాడకం వల్ల పిల్లలు శారీరక శ్రమకు దూరమవుతున్నారు, ఇది భవిష్యత్తులో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ముప్పులకు దారితీయవచ్చు. ఫోన్ చూస్తూ చిప్స్, జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో ‘డోపమైన్’ విడుదలయ్యి, వారు ఆ ఆహారానికి బానిసలవుతున్నారు. దింతో ఫోన్ పట్టుకోగానే ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతోంది.

తల్లిదండ్రులు ఏం చేయాలి 
 పిల్లలకు ఫోన్ వద్దు అని చెప్పే ముందు, తల్లిదండ్రులు  ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలి. భోజనం చేసే సమయంలో డైనింగ్ టేబుల్ వద్ద ఫోన్లు, టీవీలు అస్సలు ఉండకూడదు. పిల్లలను బయట ఆడుకోవడానికి ప్రోత్సహించాలి. వ్యాయామం, ఆటల వల్ల మూడు నెలల్లోనే బరువు తగ్గడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు నిరూపించారు. ఫోన్ ఇచ్చి వదిలేయకుండా, పిల్లలతో కలిసి సమయం గడపడం వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

 ఒక చిన్న అలవాటుగా మొదలయ్యే ఫోన్ వాడకం, పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. ఇప్పటికైనా  పిల్లలను స్క్రీన్ నుంచి తప్పించి, ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు నడిపించండి.

©️ VIL Media Pvt Ltd.