Reading Time: 2 minutes

న్యూఢిల్లీ: చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం సాధ్యమని.. తుపాకులతో కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. మాట్లాడితే ప్రజాస్వామ్యం అంటారు కానీ హింసను ఎలా సమర్థిస్తారు అని ప్రశ్నించారు. కాంబోడియా, పెరూ, కొలంబియాలో భయంకర రక్తపాతం జరిగిందని పేర్కొన్నారు. ‘‘దేశాభివృద్ధికి మావోయిస్టు సిద్ధాంతాలు, విధానాలు తీవ్ర ఆటంకం. మావోయిస్టుల రక్తపాత సిద్ధాంతాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. బస్తర్‌లో నక్సల్స్ అనేక ఏళ్లపాటు సమాంతర ప్రభుత్వం నడిపారు. ఆయుధాలు వీడాలని బస్తర్ వెళ్లి పలుసార్లు కోరాం’’ అని అన్నారు.

నక్సలిజం నశించాలని గిరిజనులు కూడా కోరుకుంటున్నారని అమిత్ షా స్పష్టం చేశారు. ‘‘నక్సలిజంపై పోరులో ప్రజలు కూడా మాకు అండగా నిలిచారు. వేల మంది సైనిక బలగాలు, పోలీసులను నక్సల్స్ చంపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అభివృద్ధినే కోరుకుంటున్నారు.. హింస కాదు. బస్తర్ యువకులను కలిశా.. వాళ్లందరూ నక్సలిజాన్ని వ్యతిరేకించారు. ప్రస్తుత సమాజంలో నక్సలిజానికి తావు లేదు. ఎన్డిఎ పాలనలో మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరుగుతోంది. నక్సలైట్ల ఎజెండాలో అభివృద్ధి అన్నది లేదు. నక్సలైట్లు తమ ఉనికి కోసమే పోరాడుతున్నారు. నక్సలైట్లు.. భగత్‌సింగ్, బిర్సాముండా కారు. వాళ్లతో నక్సలైట్లను పోల్చకూడదు. ప్రజలను చంపేవారు దేశభక్తులు ఎలా అవుతారు? నక్సలైట్లు తమ సిద్ధాంతాన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు’’ అని అమిత్ షా తెలిపారు.

నక్సలైట్లకు ఆదర్శం భారతీయులెవరూ కాదు.. వారికి మావో ఆదర్శమని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘రోడ్లు, విద్యుత్ వంటి సదుపాయాలు లేకుండా గిరిజన ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి. నక్సల్స్.. చిన్న పిల్లలకు తుపాకులు, ఆయుధ సామాగ్రి ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల యువత జీవితాలను నక్సల్స్ నాశనం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. విద్య, వైద్య, మౌలిక వసతులను కూడా నక్సల్స్ ధ్వంసం చేస్తున్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం.. రాజ్యాంగాన్ని స్వీకరించాం. ఆయుధాలు చేపట్టి ప్రజల ప్రాణాలు తీయాలని ఏ సిద్ధాంతాలు చెప్పాయి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని నక్సల్స్ గ్రహించాలి. స్కూళ్లు, బ్యాంకులు, ఆస్పత్రులు తగలబెట్టేవారి వల్ల అభివృద్ధి ఎలా సాధ్యం? ఆయుధాలు చేతుల్లోకి తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచే నక్సలిజం అభివృద్ధి చెందింది. ఇందిరా గాంధీ వల్లే మావోయిస్టు పార్టీ అన్ని ప్రాంతాలకు విస్తరించింది’’ అని అమిషా ధ్వజమెత్తారు.