
Riyan Parag: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టులో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొన్ని సీజన్లుగా జట్టును నడిపించిన సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ట్రేడ్ అవ్వడంతో, రాయల్స్ తమ కొత్త నాయకుడిగా యువ క్రికెటర్ రియాన్ పరాగ్ ని నియమించింది. గౌహతిలోని అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ACA) స్టేడియంలో CSKతో జరిగే తొలి మ్యాచ్‌తోనే పూర్తి స్థాయిలో పరాగ్ తన కెప్టెన్సీ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు.
కెప్టెన్ రేసులో ఐదుగురు:
కెప్టెన్ ఎంపిక అంత సులభంగా జరగలేదని రాజస్థాన్ రాయల్స్ టీమ్ హెడ్ కోచ్ కుమార సంగక్కర వెల్లడించారు. ఈ బాధ్యత కోసం పరాగ్‌తో పాటు మరో నలుగురు కీలక ఆటగాళ్లైన రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, సందీప్ శర్మ పేర్లని యాజమాన్యం పరిశీలించింది. ఈ ఐదుగురు అభ్యర్థులతో మేనేజ్‌మెంట్ పలు దఫాలుగా చర్చలు జరిపింది.. మేము అభ్యర్థులతో చాలాసార్లు మాట్లాడాం.. ఆ ఐదుగురికీ జట్టును నడిపించే సత్తా ఉందని మాకు తెలుసు.. కానీ రియాన్ పరాగ్ మాత్రం మేనేజ్‌మెంట్ అడిగిన క్లిష్టమైన ప్రశ్నలకు చాలా ఆలోచనాత్మకంగా సమాధానమిచ్చాడు. కేవలం కెప్టెన్‌గా ఉండటమే కాకుండా, జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో అతనికి స్పష్టమైన విజన్ ఉందని సంగక్కర కొనియాడారు.
రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు:
రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, సామ్ కరన్, షిమ్రోన్ హెట్మెయర్, వైభవ్ సూర్యవంశీ, డోనోవన్ ఫెరీరా, లువాన్-డ్రే ప్రిటోరియస్, రవి సింగ్, అమన్ పెరాల, శుభమ్ దూబే, ఆడమ్ మిల్నే, బ్రిజేష్ శర్మ, జోఫ్రా ఆర్చర్, కుల్దీప్ సేన్, క్వేనా మఫాకా, నాంద్రే బర్గర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ.