Reading Time: < 1 minute

ఇందిరా పార్కులో అక్రమ నిర్మాణాలు…రంగంలోకి హైడ్రా

Caption of Image.

హైదరాబాద్  లోని  ఇందిరా పార్కులో అక్రమ నిర్మాణాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు సాగుతున్న ప్రయత్నాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగి అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను చూసి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇందిరా పార్కులో కొత్త స్కేటింగ్ రింగ్‌ను ఏర్పాటు చేసిన తర్వాత, పాత స్కేటింగ్ రింగ్ ఖాళీగా ఉంది. ఈ స్థలాన్ని అదనుగా భావించిన ఓ ప్రైవేట్ వ్యక్తి, సమ్మర్ క్యాంప్ పేరుతో కరాటే క్లాసులు నిర్వహించడం మొదలుపెట్టాడు. కేవలం క్లాసులకే పరిమితం కాకుండా, అక్కడ శాశ్వత ప్రాతిపదికన కరాటే శిక్షణ కేంద్రాన్ని నిర్మించేందుకు కుట్ర పన్నాడు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే నిధుల నుంచి 30 లక్షల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదనలు కూడా పంపాడు.అనుమతులు రాకముందే నిర్మాణ సామగ్రిని అక్కడ కుమ్మరించడమే కాకుండా, ఇందిరా పార్క్ ప్రహరీ గోడను కూడా కూల్చివేశారు. ఈ అక్రమాలపై వాకర్స్ అసోసియేషన్ పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అధికారుల ఉదాసీనతతో విసిగిపోయిన వాకర్స్ చివరకు హైడ్రాను ఆశ్రయించారు.

ఫిర్యాదు అందిన వెంటనే క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన కమిషనర్ రంగనాథ్ అక్కడ జరుగుతున్న అక్రమాలను చూసి షాక్‌కు గురయ్యారు. ఏ అనుమతులు లేకుండా పార్కు గోడను ఎలా కూలుస్తారని అధికారులను ప్రశ్నించారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించడమే కాకుండా కూల్చిన గోడను వెంటనే పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 

 

©️ VIL Media Pvt Ltd.